News

భారత్ కోలుకుంటోంది

838views

కోవిడ్‌ రెండో దశ దేశంలో ఉద్ధృతమైపోతున్న వేళ మంగళవారం ఒకింత ఊరట కలిగింది. 61 రోజుల తర్వాత తొలిసారిగా.. రోజువారీ కేసుల సంఖ్య కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా నమోదైంది. తాజాగా 3,29,242 కొత్త కేసులు బయట పడగా.. 3,56,082 మంది కోలుకున్నారు. ఏప్రిల్‌ 27 తర్వాత నమోదైన అతి తక్కువ రోజువారీ కేసుల సంఖ్య ఇదే. ఇంతవరకు 1,90,27,304 మంది కోవిడ్‌ను జయించారు. గడచిన 24 గంటల్లో 3,876 మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

సాధారణంగా ప్రతి ఆదివారం పరీక్షల సంఖ్య తగ్గుతుండటంతో ఆ ప్రభావం మంగళవారం విడుదల చేసే గణాంకాల్లో కనిపిస్తుంటుంది. గత 5 మంగళవారాల్లో ఎప్పుడూ కొత్త కేసుల కంటే ఎక్కువమంది కోలుకున్న దాఖలాలు లేవు. ఈసారి మాత్రం కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం.

గతేడాది సెప్టెంబరులోనూ గరిష్ఠ స్థాయిలో కేసులు వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఆ నెల 19న తొలిసారి ఇలా కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య అధికంగా నమోదైంది. ఆ తర్వాత కొన్ని రోజులు లెక్కల్లో కొంత హెచ్చుతగ్గులు నమోదైనా అంతిమంగా రోజువారీ కేసుల క్షీణత మొదలైంది. తాజాగా మంగళవారం నాటి లెక్కలు కూడా మళ్లీ అలాంటి పరిస్థితిని సూచిస్తున్నాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. దేశంలో ఇంతవరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2.3 కోట్లకు చేరువైంది. కోవిడ్‌ బారిన పడినవారిలో ఇంతవరకు 2,49,992 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.