
ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజా స్ట్రిప్‌లోని ఒక బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడంతో, టెల్ అవీవ్ నగరంపై 130 క్షిపణులు ప్రయోగించామని పాలస్తీనా మిలిటెంట్లు చెప్పారు.
స్థానికులను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించిన గంటన్నర తర్వాత వైమానిక దళం 13 అంతస్తుల ఆ భవనాన్ని కూల్చేసిందని రాయిటర్స్ చెప్పింది.
మిలిటెంట్లు జరిపిన రాకెడ్ దాడులకు స్పందనగానే, తాము గాజాలో మిలిటెంట్లను టార్గెట్ చేశామని ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది.
మిలిటెంట్లు ఇప్పటికే వందలాది రాకెట్లను జెరూసలెం, ఇజ్రాయెల్‌లోని మిగతా ప్రాంతాలపైకి ప్రయోగించారు.
ఇజ్రాయెల్ దాడిలో ధ్వంసమవుతున్న పాలస్తీనా మశీదు
2017 తర్వాత జెరూసలెంలో అత్యంత దారుణ హింసాత్మక దాడులు జరుగుతున్నాయి.
మిలిటెంట్లు, సైన్యం మధ్య ఘర్షణల్లో ఇప్పటివరకూ 31 మంది వరకూ చనిపోయారు.
ఇజ్రాయెల్‌లో ముగ్గురు చనిపోగా, సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో 28 మంది పాలస్తీనియన్లు మరణించారు.
“జెరూసలెం మీద మొదటిసారి రాకెట్లు ప్రయోగించిన హమాస్ మిలిటెంట్లు హద్దు మీరారు” అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంతక ముందు అన్నారు.
అల్-అక్స్ మసీదును కాపాడుకోడానికే పోరాడుతున్నామని గాజాను తమ అధీనంలో ఉంచుకున్న హమాస్ మిలిటెంట్లు చెబుతున్నారు.





