News

జలియన్ వాలాబాగ్ దురంతానికి నేటితో నూట రెండేళ్ళు

700views

లియన్ వాలాబాగ్ మారణహోమం జరిగి నేటికి 102 ఏళ్ళు గడిచాయి. మొదట ఆ దురంతం వివరాలు తెలుసుకుందాం…..

పంజాబ్ లోని అమృత్సర్లో గల ఒక పబ్లిక్ గార్డెన్ జలియన్ వాలాబాగ్. 1919 ఏప్రిల్ 13 న పంజాబీ న్యూ ఇయర్. ఈ సందర్భంగా ఈ ఉద్యానవనంలో సమావేశమైన ప్రజలను బ్రిటిష్ దళాలు చుట్టుముట్టి వారిపై మారణకాండ జరిపింది. ఇక్కడ జరిగిన ఈ దురంతమే జలియన్ వాలాబాగ్ దురంతం. ఈ దుర్ఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్ధం అక్కడ 1951 లో ఒక స్మారకం స్థాపించబడింది. ఈ స్మారకం జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ 6.5 ఎకరాల ఉద్యానవనం, సిక్కుల పవిత్ర పుణ్యకేత్రమైన స్వర్ణ దేవాలయానికి సమీపంలో ఉంది.

జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన సంఘటన. 1919 ఏప్రిల్ 13 న జనరల్ డయ్యర్ సారథ్యంలో బ్రిటీష్ సైనికులు  ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 మందికి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.

ఆ అమరులకు నా నివాళులు : ప్రధాని మోడీ

జలియన్‌ వాలాబాగ్‌ మారణకాండలో అమరులైన వారికి ప్రధాని నరేంద్రమోడీ నివాళి అర్పించారు. వారు కనబరచిన అద్వితీయమైన ధైర్య సాహసాలు, త్యాగం ప్రతి భారతీయుడిలోనూ శక్తిని నింపుతాయన్నారు. నేటితో ఆ నరమేధం జరిగి 102 ఏళ్లు గడిచిన సందర్భంగా ఆయన ఈ మేరకు మంగళవారం ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘జలియన్‌ వాలాబాగ్‌ దురంతంలో అమరులైన వారికి నా నివాళులు. వారి ధైర్యం, సాహసం, త్యాగం ప్రతి భారతీయ పౌరునిలో శక్తిని పెంపొందిస్తాయి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరపురాని చేదు జ్ఞాపకం : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం ట్విటర్‌ వేదికగా జలియన్‌ వాలాబాగ్‌ అమరవీరులకు నివాళి అర్పించారు. ‘అమరులకు నా నివాళులు. ఎన్నేళ్లు గడిచినా ఆ చేదు ఘటన ప్రతి ఒక్క భారతీయుడి గుండెలో మెదులుతుంటుంది. వారి త్యాగానికి దేశం ఎప్పటికీ వారికి రుణపడి ఉంటుంది’ అని వెంకయ్య ట్వీట్‌ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.