ArticlesNews

ఉగాది నాడుదయించిన యుగపురుషులు ఆర్.ఎస్.ఎస్. వ్యవస్థాపకులు డా|| కేశవ బలీరాం హెడ్గేవార్

926views

న దేశంలో వివిధ కాలాల్లో వివిధ ప్రాంతాల్లో అనేక మంది మహా పురుషులు జన్మించారు. కొంత దేశ పరిజ్ఞానం ఉన్న వారు అనేక మంది మహా పురుషుల పేర్లు, వారి జీవన విశేషాలు చెప్పగలరు. ఆ యా మహా పురుషుల జీవన కార్య ప్రభావం జాతీయ జీవనం పై శాశ్వత ముద్ర వేసింది. అయితే వారు ప్రారంభించిన సంస్థలు, ఆశయాల కోసం పనిచేస్తున్న వారు కొద్ది కాలానికే అదృశ్యం కావడం చూస్తూంటాం. అయితే దీనికి భిన్నమైన ఉదాహరణ డా|| కేశవ బలీరాం హెడేవర్ జీవితంలో కనపడుతుంది.

1889లో ఉగాది నాడు నాగపూర లో కేశవ్ జన్మించాడు. అంటే 131 సంవత్సరాల క్రితం. పుట్టింది మధ్య తరగతి కుటుంబంలో. 1940లో తన 51 వ ఏట తనువు చాలించారు. వారు 1925లో విజయ దశమి రోజున నాగపూర్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని (ఆర్.ఎస్.ఎస్.) ప్రారంభించారు. ఇప్పటికీ అర్.ఎస్.ఎస్.వయస్సు 96 సంవత్సరాలు. విచిత్రం 1925 లోనే భారత కమ్యునిస్టు పార్టీ ప్రారంభం అయింది.
ఆ నాటికి భారత దేశం లోని, ప్రపంచంలోని మేధావుల్లో, యువతలో కమ్యునిజం పట్ల ఎంతో ఆకర్షణ ఉన్నది. ప్రారంభం నుండి అనేక ప్రతికూలతల మధ్య సంఘ్ ప్రారంభ దినాలు గడిచాయి. 1932 లోనే ఆంగ్లేయ ప్రభుత్వం అర్.ఎస్.ఎస్.పట్ల కన్నెర్రజేసింది. అనేక ఆంక్షలను విధించింది. కారణం కేశవరావు కలకత్తాలో వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడు అనేక విప్లవ సంస్థలతో సన్నిహిత సంబంధం కల్గి ఉండడమే! ఆంగ్లేయ పోలీసు శాఖ అర్.ఎస్.ఎస్. కార్య కలాపాలను వేయి కండ్లతో పరిశీలిస్తూ ఉండేది. సంఘం శైశవ దశలో ఉన్నప్పుడే డా|| కేశవ బలీరాం హెడేవార్ తనువు చాలించారు. చాలా మంది పరిశీలకులు ఆర్.ఎస్.ఎస్. కథ అయిపోయింది అనుకున్నారు. అలా అయిందా? –

నేడు దేశంలో, విదేశాలలో సైతం అర్.ఎస్.ఎస్. పేరు వినని వారు లేరు. కానీ అర్.ఎస్.ఎస్. సంస్తాపకుల పేరు,వారు జీవన విశేషాలు తెలుసున్న వారు మాత్రం పరిమితం. దీనికి కారణం ఏమిటి?
డా. హెడ్డెవార్ తన గుర్తింపు కోసం తాపత్రయ పడ లేదు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసే కార్యకర్తలను తయారు చేయడం తోపాటు,ఇలాంటి కార్యకర్తలు నిరంతరం ఒక గొలుసు వలె తయారయ్యే ఒక కార్య పద్దతిని ఏర్పరిచారు. అదే అర్.ఎస్.ఎస్ శాఖ కార్య పద్దతి.సంఘంలో అన్ని వయస్సుల వారు, శిశువుల నుండి వృద్ధుల వరకు ఉంటారు. అన్ని వయస్సుల కొత్త వారు నిరంతరం చేరుతూ ఉంటారు. కలహాలు, ముఠాలు లేకుండా అందరూ కలిసి, మెలసి పనిచేసే అలవాట్లను అలవాటు చేశారు.

డా|| కేశవ బలీరాం హెడేవర్ ఆ నాటి అన్ని సామాజిక ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. యువకుడిగా విప్లవ సంస్థలలో పాల్గొన్నారు. ప్రముఖ విప్లవ సంస్థ అనుశీలన సమితిలో పనిచేశారు. దేశంలోని సాయుధ ఉద్యమాలను ఒకే గొడుగు కిందకు రావడానికి కృషి చేశారు. తిలక్, గాంధీజీ నేతృత్వంలోని కాంగ్రెస్ లో విదర్భ ప్రాంత కమిటీ సభ్యునిగా పనిచేశారు విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1920 నాగపూర్ కాంగ్రెస్ మహాసభల నిర్వహణలో వాలంటీరు బృందానికి నాయకత్వం వహించారు. రెండు సార్లు జైలుకు వెళ్లారు. పత్రికలు నడిపారు. అనేక చిన్న సంస్థలను నడిపారు. ప్రజా జీవితంలో పూర్ణ అనుభవాలను పొందారు. అనేక మంది జాతీయ నాయకులతో సన్నిహితంగా మెలిగారు. సంఘ సీనియర్ నాయకులు, గొప్ప మేధావి, అయిన శ్రీ దత్తో పంత్ తేండ్లే డా.కేశవరావు జీవితాన్ని విశ్లేషిస్తూ..” నేడు వికాస మార్గాన అర్.ఎస్.ఎస్. అనేక రంగాల్లో ప్రవేశించింది. ఈ వికాస ప్రేరణ డా|| కేశవ బలీరాం హెడేవార్ సామాజిక జీవనం లోని వివిధ ఘట్టాల నుండి లభించింది” అని పేర్కొన్నారు. వారిజీవితంలో అనేక ఉదాహరణలు కలవు. సంఘం ప్రారంభం అయిన ఒక సంవత్సరానికి రాంటెక్ లోని ప్రాచీన శ్రీ రామఉత్సవాలలో భక్తులకు అన్ని రకాలుగా సేవలను అర్.ఎస్.ఎస్.సభ్యులు అందించారు. ఈ అనుభవంతో అర్.ఎస్.ఎస్ సేవా విభాగం ప్రారంభం అయింది. ఇలాంటి అనుభవాలు అనేకం…… నేటికీ కేశవరావు జీవన శైలి ఆర్.ఎస్. ఎస్.సభ్యులకు, నాయకులకు నిరంతరం ప్రేరణా శ్రోతస్సు.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం (ఆర్.ఎస్.ఎస్.) నేడు దేశంలో ఒక ప్రముఖమైన సంస్థ. ఆర్.ఎస్.ఎస్. ఉనికిని ఏ రంగంలోనూ, ఎవ్వరూ విస్మరింపజాలరు. చాలామంది బి.జె.పి.కి గల బలంద్వారానే ఆర్.ఎస్.ఎస్. ప్రభావాన్ని లెక్కిస్తూ ఉంటారు. ఇది సరియైన కొలమానం కాదు. హిందూసమాజ జీవనంలో రాజకీయాలు, అధికారం ప్రధాన కేంద్ర బిందువుకాదు. ఒక ముఖ్య అంశం మాత్రమే! దేశంహితం కోసం నిరంతరం పనిచేసే వ్యక్తుల సంఖ్య, వారిగుణాత్మకత, భారతదేశాన్ని రామరాజ్యం వైపు తీసుకువెళ్ళడంలో సామాజిక మార్పుకై జరుగుతున్న కృషి, వీటి ప్రభావం ఆధారంగానే ఆర్.ఎస్.ఎస్.పనిని అంచనావేయడం సరియైనది.

వ్యక్తుల నిర్మాణం లక్ష్యంగా శాఖ :

ఆర్.ఎస్.ఎస్. ఒక బహిరంగ సంస్థ. రోజూ ఉదయమో, సాయంత్రమో, ఏదో సమయంలో రోజూ ఒకగంటసేపు ఆర్.ఎస్.ఎస్. శాఖలో ఆర్.ఎస్.ఎస్. సభ్యులు (స్వయంసేవకులు) కలుస్తారు. పాత సభ్యులతోపాటు కొత్తవారు, అన్ని వయసులవారు చేరుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు అన్ని వయసుల కొత్తవారిని సంఘంలో చేర్పించుకునే ప్రక్రియ విస్తరిస్తున్న సంఘానికి ఒక ప్రధాన కారణం. వయస్సు, చదువు, సామాజిక హెూదా, కులము, ఆర్ధిక అసమానతలు వీటికి అతీతంగా ఆర్.ఎస్.ఎస్. శాఖలో హిందువులు కలుస్తారు. “మనమందరము సోదరులము, భారతమాత సంతానం. అందరము కలిసి ఉజ్వల భారతంకోసం కలిసి పనిచేద్దాం,” ఈ లక్ష్యాన్ని అలవాటును కలిగించేవిధంగా శాఖలో శారీరిక, బౌద్ధిక, సేవాకార్యక్రమాలు ఉంటాయి. ‘భారత్ మాతాకు జయ్’ అనే మంత్రంతో సంఘప్రార్థన, శాఖ పూర్తి అవుతాయి. సామాజిక మార్పు లక్ష్యంగా

సామాజిక సంఘటన :

ఏ తాత్కాలిక ప్రయోజనాలను ఆశించకుండా “హిందూసమాజ సంఘటన, హిందూసమాజ సంఘటన కొరకే” అనే స్ఫూర్తితో సంఘం దశాబ్దాలపాటు పనిచేసింది. అధికారప్రాప్తి హిందూసమాజ సంఘటన లక్ష్యంకాదు. భారతదేశ ఉజ్వల భవిషత్తుకొరకు హిందూసమాజ సంఘటన అనే స్ఫూర్తితో సంఘం పనిచేసిన కారణంగా హిందూసమాజ సంఘటనా ప్రభావం నేడు దేశమంతా కనిపిస్తున్నది. దేశంలోని అన్నిరంగాల్లోనూ కనిపిస్తున్నది. నేడు దేశవ్యాప్తంగా బలమైన పునాదులపై హిందూసమాజం సంఘటితమైంది.
ఈ పునాదులపైనే వికాస క్రమంలో సంఘం మరొక ముందడుగు – “సామాజిక మార్పు లక్ష్యంగా హిందూసమాజ సంఘటన” అనే దిశలో పని ప్రారంభించింది. నేడు ఆ దిశలలో ఈ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

అవి 1. మన కుటుంబం తల్లి,తండ్రులు, పెద్దలను గౌరవించడం, దైవభక్తి, కుటుంబం పట్ల బాధ్యతలు… వంటి వ్యక్తిగత మంచిగుణాలను (వ్యక్తిగత సంస్కారాలను) నిర్మించే కేంద్రంగానే కాక దేశభక్తి, సామాజిక స్పృహ, సేవవంటి గుణాలను (సామాజిక సంస్కారాలను) కుటుంబ సభ్యులందరిలో కలిగించేవిధంగా కుటుంబంలోని వాతావరణాన్ని ఏర్పర్చుకోవాలి. కర్ణాటకకు చెందిన శ్రీకృష్ణప్పగారు ఈ పనికి పునాదులు వేశారు.

2.హిందువులందరిలో కుల అసమానతలను, అంటరానితనాన్ని, స్త్రీ-పురుష ఆధిక్యతలను తొలగించి అందరిమధ్య సామాజిక సమరసతను ఏర్పర్చాలి. ఈ సామాజిక సమరసత ద్వారానే హిందూ సమాజ సమైక్యత ప్రగతి సాధ్యం అవుతుంది. శ్రీ దత్తోపంత్  14 ఏప్రిల్ 1983లో “సామాజిక సమరసతా మంచ్” ప్రారంభించారు.

3. భగవంతుడు ఒక్కడే. భక్తులం అనేక పేర్లతో పిలుస్తాము. అలాంటప్పుడు మతం మార్పిడి ఎందుకు? సామ్రాజ్యవాద లక్ష్యంగా జరుగుతున్న మతమార్పిడివల్ల మన కుటుంబానికి, మన కులానికి, మన గ్రామానికి, మనదేశానికి, ధర్మానికి అన్నింటికి ప్రమాదం ఏర్పడుతోంది. ఈ మతం మార్పిడికి అడ్డుకట్టవేయాలి. మతం మారినవారిని స్వచ్ఛందంగా వెనక్కు ఆహ్వానించాలి. ఈ దిశలో కార్యాచరణకు పూనుకోవాలి. స్వామి వివేకానంద, దయానంద సరస్వతి ఆశయాల అమలుకు ఈ పని ప్రారంభం అయింది.

4 భారతదేశం గ్రామాలతో కూడిన దేశం. దేశంలో 6లక్షల గ్రామాలున్నాయి. అన్నివిధాలా గ్రామాల స్వయం ప్రతిపత్తి మన గ్రామీణ వ్యవస్థ ప్రత్యేకత. వ్యవసాయంలో ఆదాయంలేని కారణంగా, గ్రామాలలో మౌలికవసతులు లేని కారణంగా ప్రతి సంవత్సరం లక్షలమంది తమతమ గ్రామాలను వదిలి పట్టణాలకు, నగరాలకు వలస పోతున్నారు. ఈ వలసలవల్ల, వేగవంతంగా పెరుగుతున్న పట్టణీకరణవల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. దీని నివారణ కొరకు గ్రామాభివృద్ధి కొరకు ఒక పెద్ద ప్రయత్నం జరగాలి. 80వ దశకంలోనే శ్రీ నానాజీ దేశ్ ముఖ్ ఈ పనిని ప్రారంభించారు.

5 భారతదేశం ప్రధానంగా వ్యవసాయదేశం. వ్యవసాయానికి ఆధారం గోసంపద. ఈ సత్యాన్ని మరిచిపోయిన కారణంగానే రసాయనిక ఎరువుల వినియోగంవల్లనే అనేక రోగాలు వస్తున్నాయి. గోవును సర్వదేవతల నిలయంగా ఆరాధించటమే కాక, గోమూత్రము, గో పేడ, స్వదేశీ ఆవుపాలద్వారా అనేక ఉత్పత్తులను తయారుచేయాలి. వీటి ద్వారా స్వయంపోషకమైన నూతన ఆర్ధిక వ్యవస్థను, ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పర్చుకోవటం కోసం ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి.

6. ప్రకృతి మన తల్లి. ప్రకృతిలోని గాలి, నీరు, చెట్లు, అడవులు, వీటన్నింటిని రక్షించుకోవాలి. ప్రకృతిని దోచుకోవటంకాదు. అవసరమైనంతమేరకే ప్రకృతిలోని వనరులను వినియోగించుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. పర్యావరణానికి హాని కలిగించే అన్ని అలవాట్లు మానుకోవాలి. పర్యవరణాన్ని సంరక్షించే జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి. గత దశాబ్దంగా ఆర్.ఎస్.ఎస్. స్వయంసేవకులు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో సమాజంలోని అనేకమంది సామాజిక కార్యకర్తలతోడుని తీసుకుని పై ఆరు లక్ష్యాల సాధనకు నూతన ప్రయోగాలను చేస్తున్నారు. అనేక ప్రయోగాలు విజయాన్ని ఇస్తున్నాయి. సామాజిక మార్పులక్ష్యంగా ఈ ప్రయోగాలవల్ల ఉజ్వల సమైక్యభారతం మనకళ్ళముందే నిర్మింపబడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

– కె. శ్యామ్ ప్రసాద్, జాతీయ కన్వీనర్, సామాజిక సమరసత
9440901360

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.