
అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణ నిధి కోసం గ్రామాలలో పర్యటిస్తున్న రామ సేవకులకు అడుగడుగునా ఎదురవుతున్న అద్భుతమైన అనుభవాలని మనం గతంలో తెలుసుకున్నాం.
ఇప్పుడు తాజాగా అలాంటిదే మరో అబ్బురపరిచే సంఘటన నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేట గ్రామంలో చోటు చేసుకుంది. కొత్తపేటలో మెట్టు భాగ్యమ్మ అనే మహిళ నివసిస్తోంది. అత్యంత నిరుపేద కుటుంబం. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. ముగ్గురు దివ్యాంగులే. ముగ్గురిలోనూ మానసిక, శారీరిక వైకల్యం ఉంది.
నిధి కోసం వెళ్లిన రామ సేవకులు ” అమ్మా మేము అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి కోసం మీ వద్దకు వచ్చాం” అని చెప్పగానే వెంటనే ఆ తల్లి ” అయ్యో నాయనా ఎంత భాగ్యం? ఆ రామునికి ఎంతిచ్చినా తక్కువే కదా?” అంటూ చకచకా రూ.3116/-లు తీసి ఇచ్చారు. ఆశ్చర్యపోయిన రామ సేవకులు ” అమ్మా నీ దగ్గర ఖర్చులకు ఉన్నాయో లేదో….. అంత మొత్తం వద్దు లేమ్మా” అంటూ నచ్చజెప్పబోయారు. అయినా ఆ తల్లి వినిపించుకోలేదు. ” “ఫర్వాలేదు నాయనా మన బాధలు ఎప్పుడూ ఉండేవే కదా? ఈ జన్మకు ఒక్కసారే కదా అయోధ్యలో రాములవారి గుడి కట్టడం? ఏం ఫర్వాలేదులే తీసుకోండి.” అని ఎంతో సంతోషంగా వారి చేతిలో ఆ డబ్బులుంచింది.
అమ్మ ఏదో మంచి పని చేస్తోందని భావించారో, లేక మా ఇంటికెవరో చుట్టాలొచ్చారని సంబరపడ్డారో తెలియదు కానీ అన్నెం పున్నెం ఎరుగని ఆమె ముగ్గురు కూతుళ్లు కూడా నిర్మలమైన నవ్వులు చిందించారు. ఈ దేశంలో ప్రతి గుండెలోనూ ఆ రాముడున్నాడని, ప్రతి హిందువూ అత్యంత భక్తి విశ్వాసాలతో తన గుండెల్లో ఆ రాముడి గుడి కట్టుకున్నాడని వేరే చెప్పాలా?





