
మీనా హారిస్…. అదేనండీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ బంధువు. మొన్న ఈమధ్య భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కున్న మీనా హారిస్ తన వివాదాస్పద ప్రవర్తనతో అమెరికాలో కూడా చిక్కుల్లో పడింది. తాజాగా తన తీరు మార్చుకోవలిసిందిగా మీనా హారిస్ ను వైట్ హౌస్ వర్గాలు కోరినట్లుగా సమాచారం. మీనా హారిస్ తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి తన సమీప బంధువైన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును ఉపయోగించుకుంటున్నారనేది ఆమెపై వచ్చిన ప్రధాన ఆరోపణ. కమలా అధికార బాధ్యతలు స్వీకరించిన అనంతరం కూడా మీనా ధోరణి మారకుంటే.. ఇటువంటి సున్నితమైన అంశాలే బైడెన్-హారిస్ ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
36 సంవత్సరాల మీనా హారిస్, కమలా హారిస్ సోదరి కుమార్తె. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈమె కమలా హారిస్ తరపున విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. మీనాకు ఇంస్టాగ్రాంలో ఎనిమిది లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం. న్యాయవాది అయిన మీనా.. ”కమలా అండ్ మాయాస్ బిగ్ ఐడియా” తదితర పుస్తకాలు కూడా వ్రాశారు. ఈమె ‘ఫినామినల్’ అనే వస్త్రాల బ్రాండ్ కు వ్యవస్థాపకురాలు కూడా. ఐతే తమ బ్రాండ్ వస్త్రాలపై ‘వైస్ ప్రెసిడెంట్ ఆంటీ’ అంటూ ముద్రించడం, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రైవేటు విమానంలో ప్రయాణించటం వంటి చర్యలు విమర్శలకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో మీనా కార్యకలాపాల్లో వైస్ ప్రెసిడెంట్ పేరును ఉపయోగించవద్దని.. వైట్ హౌస్ కు చెందిన న్యాయవాదులు మీనా హారిస్ కు హితవు పలికారు. అంతేకాకుండా ఉపాధ్యక్షురాలి బంధువుగా ఆమె పాటించాల్సిన నియమ నిబంధనలను కూడా వివరించినట్లు తెలిసింది.
కాగా, ఎన్నికల ప్రచారం నాటి నుంచి అన్ని న్యాయపరమైన, నైతికపరమైన నియమాలను తాను అనుసరిస్తున్నానని మీనా హారిస్ స్పష్టం చేసినట్టు సమాచారం. అంతేకాకుండా ఉపాధ్యక్షురాలికి సంబంధించినవి, ఆమెను పోలిన చిహ్నాలను, పేర్లను తమ వెబ్‌సైట్ నుంచి తొలగించినట్లు కూడా ఆమె వివరించారు. ఇకపై కూడా కమలా హారిస్ పేరును తమ ఉత్పత్తుల ప్రచారంలో వాడబోమని ఆమె స్పష్టం చేశారు.





