
పుల్వామా ఉగ్రదాడి జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భారీ ఉగ్రదాడికి ముష్కరులు పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి.
జమ్మూలోని జనసమ్మర్ధ ప్రాంతాలలో భారీ పేలుళ్ళకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేసిన జమ్మూ పోలీసులు ఒక నర్సింగ్ విద్యార్థి సహా నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
జమ్మూలోని బస్టాండ్ ప్రాంతంలో బ్యాగ్ తో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ యువకుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాగును తనిఖీ చేయగా దానిలో సుమారు 7 కేజీల IED బయటపడింది. ఈ వ్యక్తిని పుల్వామాలోని నవా గ్రామానికి చెందిన సొహైల్ బషీర్ కుషాగా గుర్తించారు. పాకిస్థాన్లోని అల్ బదర్ ఉగ్రవాద సంస్థతో సొహైల్ కు సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.
జమ్మూ రైల్వే స్టేషన్, బస్టాండ్, రఘునాథ్ మందిర్, లఖ్, దాదా బజార్ వంటి జన సమ్మర్థ ప్రాంతాల వద్ద పేలుళ్ళు జరపవలసిందిగా ఆల్ బదర్ సంస్థ సొహైల్ కు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇతనితో సంబంధమున్న మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మరోవైపు సాంబా జిల్లా జంగ్ ప్రాంతంలో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు, 17 చిన్న IED లు, 6 పిస్తోళ్ళు స్వాధీనం చేసుకున్నారు.





