News

భక్తే దేశానికి శక్తి

146views

దేశవ్యాప్తంగా అయోధ్య రామ జన్మభూమి నిధి సమర్పణ అభియాన్ కొనసాగుతున్న సంగతి మనకందరికీ తెలిసిందే. అలాగే రాష్ట్రంలో కూడా ఈ నిధి సమర్పణ అభియాన్ పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ క్రమంలో నిధి సేకరణలో భాగమవుతున్న కార్యకర్తలకు అనేక అద్భుతమైన అనుభవాలు ఎదురవుతున్నాయి.

నెల్లూరులో కొంతమంది కార్యకర్తల కుటుంబాలలోని మహిళలు (మాతృమూర్తులు) తాము కూడా నిధి సేకరణ కార్యంలో పాలు పంచుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. తమ చుట్టుపక్కల ఇళ్లలో నిధి సేకరించడానికి బయలుదేరారు. అక్కడే సమీపంలో మట్టి బొమ్మలు, పూల కుండీలు, హుండీలు తయారుచేసే రాజస్థాన్ కూలీలు కొందరున్నారు. వీరు రామ మందిర నిర్మాణ నిధి కోసం వచ్చామని చెప్పగానే సంతోషంగా తమ కూలీ డబ్బులలోంచి చెప్పుకోదగిన మొత్తాన్ని తీసి వీరి చేతిలో పెట్టారు.

తమ కూలి డబ్బుల్లోంచి సంతోషంగా నిధిని సమర్పిస్తున్న రాజస్థాన్ కూలీలు

ఆ నిరుపేద కూలీల రామభక్తికి ఆశ్చర్యపోతూ వారు ముందుకు సాగారు. మరి కొన్ని ఇళ్ళు తిరిగిన తర్వాత అక్కడ ఒక యువతి తాను మొక్కుబడి నిమిత్తం దేవుడి కోసం దేవుడి దగ్గర ముడుపు కట్టుకున్న మొత్తాన్ని తెచ్చి ఒక రెండు కవర్లలో నింపి వారికి అందజేసింది. “నేను ఎలాగూ దేవుడికి సమర్పించటానికే ఈ డబ్బులు దాచుకున్నాను, అయోధ్య గుడికివ్వడం మరింత ఆనందకరం” అంటూ ఆ అమ్మాయి ఆ డబ్బులను అందజేసింది వారికి.

ముడుపు కట్టుకున్న డబ్బులను గుడికి ఇస్తున్న యువతి

ఈ సంఘటనను ఆ నిధి సేకరణ కోసం తిరుగుతున్న మహిళలలోని ఒక మహిళ 5 ఏళ్ల కుమారుడు గమనిస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడు ఒకటిన్నర సంవత్సరాల నుంచి హుండీలో డబ్బులు దాచుకుంటున్నాడు. ఇంటికి వెళ్ళగానే వాళ్ల అమ్మానాన్నలతో “నేను హుండీలో వేస్తున్న డబ్బులను కూడా రామ మందిరానికి ఇచ్చేస్తాను” అని చెప్పాడు. ఆ పిల్లాడి తల్లిదండ్రులు కూడా అందుకు సంతోషంగా ఒప్పుకున్నారు. వెంటనే తన గదిలోంచి హుండీ తెచ్చి పగులగొట్టి నాలుగు వేల పైచిలుకు ఉన్న ఆ మొత్తాన్ని రామమందిర నిర్మాణ నిధికి సంతోషంగా సమర్పించాడు ఆ చిన్నోడు. ఈ విషయం అమ్మమ్మ గారింట్లో ఉన్న వాడి అక్క తెలుసుకుంది. ఇప్పుడు తాను ఊరి నుంచి వచ్చాక తన హుండీ డబ్బులు కూడా రామ మందిర నిర్మాణానికి సమర్పించడానికి ఉవ్విళ్ళూరుతోంది.

హుండీ పగులగొట్టి డబ్బులిస్తున్న బాలుడు

ఇలా అడుగడుగునా ఎన్నో రోమాంఛిత అనుభవాలు ఎదురవుతున్నాయి కార్యకర్తలకు. ఒకరిని మించి ఒకరు తమ దాతృత్వాన్ని, భక్తిని చాటుకుంటున్నారు. ఆ భక్తే దేశానికి అనంత శక్తి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.