మీకు సంస్కృతం ఇష్టం లేకపోతే ఛానల్ మార్చుకోండి – సంస్కృత వ్యతిరేకులకు స్పష్టం చేసిన మద్రాసు హైకోర్టు

ప్రాంతీయ దూరదర్శన్(డి.డి) చానెళ్లలో ప్రసారమయ్యే వార్తల్లో సంస్కృత వార్తలు కూడా ప్రసారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు కొట్టి వేసింది. వివరాల్లోకెళ్తే… గతేడాది నవంబర్ లో సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో దేశంలోని అన్ని ప్రాంతీయ డిడి ఛానెళ్లలో సంస్కృత బులెటిన్ ను ప్రసారం చేయాలని సంబంధిత అధిపతులను దూరదర్శన్, ప్రసార భారతి డైరెక్టర్ జనరల్ శశి శంకర్ ఆదేశించారు. ప్రతి రోజూ ఉదయం 7.15 నుండి 7.30 వరకు సంస్కృత వార్తలు ప్రసారం చేయాలని సూచించారు.
అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడుకు చెందిన కొంత మంది తమిళ హక్కుల కార్యకర్తలు, సంస్కృత భాష గిట్టని వాళ్లు తమ నిరసనను వ్యక్తం చేశారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో మాత్రమే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడును సంస్కృతీకరించడానికి జరుగుతున్న ప్రయత్నంగా వారు అభివర్ణించారు. తమిళం వంటి ప్రాంతీయ భాషల ప్రాముఖ్యతను తగ్గించే ప్రయత్నంగా వారు దీనిని పేర్కొన్నారు. హిందీ, సంస్కృతం వంటి భాషలను తమిళనాడు ప్రజలపై రుద్దడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మధురైలోని అన్నానగర్ కు చెందిన ముత్తుకుమార్ అనే న్యాయవాది సంస్కృత వార్తల ప్రసారం చేయాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వంచే ఉపసంహరింపజేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డి.డి వార్తల్లో సంస్కృత బులెటిన్ తప్పనిసరి చేయడం సరికాదని, భారత రాజ్యాంగం గుర్తించిన మొత్తం 22 భాషలకు సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలని, సంస్కృతంలో బులెటిన్ ను నిషేధించాలని కోర్టు, కేంద్రానికి ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
ఈ పిటిషన్ జనవరి18న చీఫ్ జస్టిస్ సంజీబ్ బెనర్జీ, జస్టిస్ ఎంఎం సుందరేశన్ లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. దీనిపై ధర్మాసనం తన అభిప్రాయాన్నివ్యక్తం చేస్తూ “పిటిషనర్ సంస్కృత వార్తలను చూడకూడదనుకుంటే, అతను టీవీని ఆపివేయవచ్చు లేదా తనకు నచ్చిన ఇతర ఛానెళ్లను చూడవచ్చని” చెబుతూ పిటషన్ ను కొట్టివేసింది.
ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సామాజిక కార్యకర్త వి.ఎస్.మనియన్ మాట్లాడుతూ, భారత దేశ ప్రాచీన భాష సంస్కృతాన్నివ్యతిరేకించే వ్యక్తులు, పాశ్చత్య భాష అయిన ఇంగ్లీష్ న్యూస్ ఛానెళ్లను ఎందుకు వ్యతిరేకించరని ప్రశ్నించారు. పాశ్చాత్య దేశాల్లోన్ని అనేక విశ్వవిద్యాలయాలు సంస్కృతాన్ని జ్ఞాన భాండాగారం అని భావిస్తారని ఆయన తెలిపారు.
Source: Organiser