
పశ్చిమబెంగాల్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్, భాజపా మధ్య మరోసారి ఘర్షణ తలెత్తింది. కోల్‌కతాలో భాజపా చేపట్టిన రోడ్ షోపై తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయి. ఇరు పార్టీలకు చెందిన శ్రేణులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నట్టు తెలుస్తోంది. ఈ ర్యాలీలో కేంద్రమంత్రి దేవశ్రీ చౌధురి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, మాజీ మంత్రి సువేందు అధికారి పాల్గొన్నారు. ఈ దాడిని ప్రజాస్వామ్యంపై ప్రత్యక్షంగా జరిగిన దాడిగా పేర్కొంటూ భాజపా బెంగాల్ శాఖ ఈ ఘటన వీడియోను విడుదల చేసింది.
వచ్చే ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానంటూ పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 2019 ఎన్నికల్లో 42 లోక్‌సభ స్థానాల్లో 18 స్థానాలు గెలుచుకున్న భాజపా.. ఏప్రిల్- మే నెలల్లో జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలని పట్టుదలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఈ రోజు పరివర్తన్ ర్యాలీ నిర్వహించింది. అయితే, ఈ ర్యాలీపై కొందరు వ్యక్తులు వాటర్ బాటిళ్లు విసిరారు. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ జెండాలను పట్టుకొన్న కొందరు వ్యక్తులు ‘గో బ్యాక్’ నినాదాలు చేయడంతోపాటు, రాళ్ళు విసిరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో దక్షిణ కోల్‌కతాలోని ముదియాలి ప్రాంతంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. గతేడాది జేపీ నడ్డా పర్యటన సందర్భంగా కూడా కోల్‌కతాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
ఇలాంటి ఎత్తుగడలు పనిచేయవు: సువేందు
ఈ ర్యాలీ కోసం పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నామని, కానీ కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వుతున్నారని భాజపా నేత సువేందు అధికారి అన్నారు. ఇలాంటి ఎత్తుగడలు పనిచేయవన్నారు. బెంగాల్ ప్రజలు తమతోనే ఉన్నారని, మార్పును కోరుకుంటున్నారని సువేందు అధికారి తెలిపారు.