
జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇటీవల స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొందిన ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సత్‌పాల్ నిశ్చల్(50) అనే నగల వ్యాపారి 50ఏళ్లుగా కశ్మీర్ లోనే నివాసముంటున్నారు. శ్రీనగర్‌లోని ఓ మార్కెట్ కు వెళ్లిన ఆయనపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. గరువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొంది కాశ్మీర్లో స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిని బెదిరించాలన్న ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
రెసిస్టంట్ ఫ్రంట్ అనే ఉగ్రముఠా ఈ దారుణానికి పాల్పడ్డట్లు ప్రకటించుకుంది. స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొందే ఎవరినైనా ఆక్రమణదారులుగాలనే భావిస్తామని ఆ ముఠా చెబుతోంది. 370 అధికరణ రద్దు తర్వాత జమ్మూ-కశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి స్థిరాస్తులను వేరే రాష్ట్రాల ప్రజలు సైతం కొనుగోలు చేసేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఇప్పటి వరకు 10 లక్షల మంది స్థానికేతరులు (?) స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో చాలా మంది అనేక సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్లి నివాసముంటున్నవారే.





