
భారత ఆర్మీ ఛీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే మూడురోజుల పర్యటన నిమిత్తం దక్షిణ కొరియాకు వెళ్ళారు. రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకార విస్తరణ కోసం ఉన్నత స్థాయి చర్చల్లో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. దక్షిణ కొరియా భారత్ కు కీలక ఆయుధ సరఫరాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఆ దేశ రక్షణ మంత్రితో జనరల్ నరవణే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్, దక్షణ కొరియా రక్షణ సంబంధాలను గురించి వారు చర్చించారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడి గాంగ్వాన్ ప్రాంతంలోని కొరియా కంబాట్ ట్రైనింగ్ సెంటర్‌ను, డేజియాన్ నగరంలోని అడ్వాన్స్ డిఫెన్స్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని కూడా జనరల్ నరవణే సందర్శిస్తారు.
ఇదిలా ఉండగా యూఏఈ, సౌదీలతో వ్యూహాత్మక సంబంధాల అభివృద్ధి లక్ష్యంతో భారత ఆర్మీ ఛీఫ్ రెండు వారాల క్రితం ఆయా దేశాలను సందర్శించిన సంగతి తెలిసిందే. గత నెల నేపాల్‌లో మూడు రోజుల పాటు పర్యటించిన నరవణే.. ముఖ్యాంశాలను చర్చించారు. అక్టోబర్‌లో విదేశాంగ శాఖ సెక్రటరీతో కలసి మయన్మార్‌ను సందర్శించిన జనరల్ నరవణే, ఆ దేశానికి జలాంతర్గామిని సరఫరాపై, సైనిక, రక్షణ సంబంధాల బలోపేతానికి చర్చలు జరిపారు. కాగా, చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆర్మీ ఛీఫ్ నరవణే పర్యటనలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.





