News

బలోచ్ వేర్పాటువాదుల దాడిలో ఏడుగురు పాక్ సైనికులు మృతి

438views

పాక్ లోని బలోచిస్థాన్‌ ప్రావిన్స్ ‌లో ఆ దేశ సైనికులపై వేర్పాటువాదులుగా అనుమానిస్తున్న కొందరు ఆదివారం విరుచుకుపడ్డారు. హర్నాయ్‌ వద్ద ఉన్న చెక్ పోస్ట్ ‌పై వీరు జరిపిన దాడిలో సుమారు ఏడుగురు పాక్‌ సైనికులు మృత్యువాత పడ్డారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాక్‌ ఆర్మీ అధికారులు వివరాలు వెల్లడించారు. ‘హార్నాయ్‌ ప్రాంతంలోని ఔట్ పోస్ట్ ‌పై కొందరు దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో ఇరువైపులా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు పాక్‌ సైనికులు మరణించారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో భారీ ఆపరేషన్‌ కొనసాగుతోంది. తప్పించుకోకుండా మార్గాల్ని నిర్బంధించాం’ అని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

ఈ దాడిపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ ‘ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన ఇది. మరణించిన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా’ అని ప్రకటించారు. కాగా గత ఐదు రోజుల నుంచి బలోచ్‌ ప్రావిన్స్ లో ఉగ్రవాదుల కోసం సైనికులు గాలింపు కొనసాగిస్తున్న క్రమంలో.. ఈ దాడి జరగడం గమనార్హం. ఈ దాడి వెనక బలోచ్‌ నేషనలిస్ట్‌ సంస్థకు చెందినవారి హస్తం ఉండొచ్చని భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.