News

బలగాల ఉపసంహరణ దిశగా భారత్, చైనాలు.

389views

తూర్పు లాడ్డాఖ్ లో‌ భారీగా మోహరించిన సైనిక బలగాలను సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నాలను కొనసాగించాలని భారత్, చైనాలు నిర్ణయించాయి. రెండు దేశాలు శుక్రవారం దౌత్య స్థాయి చర్చలు జరిపాయి. ఈ సందర్భంగా సరిహద్దుల్లో ఏడు నెలలుగా కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభనపై చర్చించాయి. భారత్, చైనా సరిహద్దు వ్యవహారాలపై ఏర్పడ్డ సంప్రదింపులు, సమన్వయ కార్యాచరణ కమిటీ (డబ్ల్యూఎంసీసీ) సమావేశం వర్చువల్‌ పద్ధతిలో జరిగింది. ఇందులో భారత బృందానికి విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి (తూర్పు ఆసియా) నవీన్‌ శ్రీవాస్తవ, చైనా బృందానికి ఆ దేశ సరిహద్దు, సముద్ర విభాగం డైరెక్టర్‌ జనరల్‌ హాంగ్‌ లియాంగ్ ‌లు నేతృత్వం వహించారు.

వివాద పరిష్కారానికి సాధ్యమైనంత త్వరగా సైనిక చర్చలు జరపాలని రెండు పక్షాలు నిర్ణయించినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ప్రస్తుత ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా బలగాల ఉపసంహరణ సాగించేందుకు ఇది వీలు కల్పిస్తుందని వివరించింది. ”ఇరు దేశాల అధినేతలు, విదేశాంగ మంత్రులు, ప్రత్యేక ప్రతినిధులు ఇచ్చిన మార్గదర్శకాలు, ఖరారు చేసుకున్న ఒప్పందాల ఆధారంగా కలిసి పనిచేయాలని నిర్ణయించాం. వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణకు కేంద్రబిందువుగా ఉన్న ప్రాంతాల నుంచి పూర్తిగా బలగాల ఉపసంహరణ కోసం కృషి చేయాలని తీర్మానించాం” అని పేర్కొంది. సెప్టెంబర్‌ 30న చివరిసారిగా డబ్ల్యూఎంసీసీ సమావేశం జరిగినప్పటి నుంచి చోటుచేసుకున్న పరిణామాలను ఈ భేటీలో సమీక్షించినట్లు తెలిపింది. దౌత్య, సైనిక స్థాయిలో సంప్రదింపులను కొనసాగించాలని నిర్ణయించినట్లు వివరించింది. మరోవైపు.. 8వ విడత సైనిక చర్చల ఫలితంపై తాజా భేటీలో సమీక్ష జరిపినట్లు చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. సైనిక, దౌత్య మార్గాల్లో కమ్యూనికేషన్‌ను కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను మరింతగా తగ్గించేందుకు, బలగాల ఉపసంహరణకు గట్టి చర్యలు తీసుకునే అంశంపై లోతైన చర్చలు జరిపినట్లు వివరించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.