
విశాఖ ఉక్కు ఉద్యోగుల ఉమ్మడి కృషికి, నైపుణ్యాలకు మరో ఘనత సాధ్యమయింది. తద్వారా కర్మాగారానికి భారీగా నిధులు ఆదా చేసి ప్రశంసలందుకున్నారు విశాఖ ఉక్కు కర్మాగారంలోని కొందరు ఉద్యోగులు. దాదాపు వారి రెండు నెలల కష్టానికి ఫలితం దక్కింది. ఈ విజయంలో పాలుపంచుకున్న ఉద్యోగులకు యాజమాన్యం ప్రశంస పత్రాలు అందించింది.
ద్రవరూపంలో ఉండే ఉక్కు పయనించే మార్గంలో వాడే కొన్ని ఇటుకల్లో తేమ ఏమాత్రం లేకుండా కాల్సనింగ్ రిఫ్రాక్టరీ మెటీరియల్ ప్లాంట్ సీఆర్ ఎంపీ) విభాగం ఉద్యోగులు సాంకేతి కంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకు గ్రెయిన్ హీటర్(జర్మనీ) వినియోగిస్తారు. ఇది ఇటుకల తయారీ విధానంలో ఎంతో కీలకమైన ప్రక్రియ. ‘జర్మనీ నుంచి తెచ్చి చాలా కాలం కావడంతో ఇప్పుడు ఆ యంత్రం మరమ్మత్తు దశకు చేరుకుంది.
దాని స్థానే కొత్త యంత్రాన్ని జర్మనీ నుంచి తీసుకురావాల్సి వస్తే దాదాపు రూ. కోటి వ్యయం అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ విభాగాధిపతి ప్రీతమ్ రాయ్ సహకారంతో అధికారులు ఆలోచన చేశారు. అధికారులు, ఉద్యోగులు వై.బాలకోటయ్య, హరిగోపాల్, ఎన్.వి.ఆర్.మూర్తి, ఎన్.రమేష్ కుమార్ రామకృష్ణ, గురుమూర్తి తదితరులు ఒక బృందంగా ఏర్పడ్డారు. ‘మేక్ ఇన్ ఇండియా’ నినా దంగా ‘ఉక్కు’లోనే తయారు చేసుకోవాలని నిర్ణ యించుకున్నారు. ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని, అనుభవాన్ని జోడించి యంత్రం తయారు చేయించేందుకు అవసరమైన ప్రణాళికలు, ఆకృతులు రూపొందించుకున్నారు. ఉక్కులోనే ‘ప్లాంట్ డిజైన్ బృందం సహకారం తీసుకున్నారు. ఆ మేరకు యంత్రంలోని ఒక్కో భాగం ఉక్కులో తయారు చేయించారు. ఊహించని విధంగా రూ. 9 లక్షలకే అది రూపుదిద్దుకుంది. దీంతో సుమారు రూ.91 లక్షలు కర్మాగారానికి ఆదా అయినట్టయింది.
దేశీయంగా తయారు చేయించడంతో ఎన్నో విధాలుగా లాభదాయకం కానుందని బృంద సభ్యులు తెలిపారు. జర్మనీ యంత్రం పాడైనా, ఏదైనా సమస్య వచ్చినా బాగు చేయడానికి చాలా ఇబ్బంది పడే వారమని, కొన్ని పరికరాలు అక్కడి నుంచే రప్పిం చాల్సి ఉండేదని పేర్కొన్నారు. ఇపుడు స్థానికంగానే తయారు చేయడంతో యంత్రంలోని ప్రతి అంశం క్షుణ్ణంగా తెలిసి ఉంటుందన్నారు. యంత్రం విజయవంతంగా పని చేస్తుండటంతో ఈ బృందంలో పని చేసిన వారికి మంగళవారం పురస్కార పత్రాలు అందించారు.





