News

భారత్ – చైనా దేశాధినేతల ముఖాముఖి?

459views

డ్డాఖ్‌ సరిహద్దు ఉద్రిక్తతలతో భారత్‌-చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఇరు దేశాధినేతలు తొలిసారి ముఖాముఖీ కలుసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నెల 10న జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌(ఎస్‌సీవో) వార్షిక సదస్సులో భారత బృందానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వం వహించనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ సదస్సులో ప్రధాని మోడీ.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఆన్‌లైన్‌ ద్వారా ముఖాముఖి చర్చలో పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించే ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ అధ్యక్షత వహించనున్నారు. చైనా ప్రతినిధుల బృందానికి జిన్‌పింగ్‌ నేతృత్వం వహిస్తున్నారు.

భారత్‌-చైనా మధ్య లడ్డాఖ్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సరిహద్దు ఘర్షణలతో గత ఆరు నెలలుగా రెండు దేశాల నడుమ ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే రెండు దేశాలు పలుమార్లు దౌత్య, సైనిక పరమైన చర్చలు జరిపాయి. అయినప్పటికీ పరిష్కారం లభించలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ, జిన్‌పింగ్‌ తొలిసారి ముఖాముఖీ అయ్యే అవకాశం రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఈ నెల 17న జరిగే బ్రిక్స్‌ సమావేశంలోనూ, నవంబరు 22న జరిగే జీ20 సదస్సులోనూ మోడీ, జిన్‌పింగ్‌ వర్చువల్‌గా కలుసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.