ArticlesNews

ఆ పుస్తకమంటే అంత భయమెందుకు?

816views

మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత రాజధాని ఢిల్లీలో కాలు మోపగానే ఢిల్లీలో భయంకరమైన అల్లర్లు సృష్టిస్తే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించవచ్చని ఇస్లామిక్ రాడికల్స్, అర్బన్ నక్సల్స్, జీహాదీ ఎలిమెంట్స్ పన్నిన కుట్ర ఫలితమే ఈ ఏడాది (2020) ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన హింసాత్మక సంఘటనలు. ఈ నేపథ్యంలోఢిల్లీకి చెందిన ముగ్గురు రచయిత్రులు “ఢిల్లీ రాయిట్స్ 2020 ది అన్టోల్డ్ స్టోరీ”  పేరిట వ్రాసిన పుస్తకమిప్పుడు దేశంలో చర్చనీయాంశమైంది. ఆగస్టు 22న ఈ పుస్తకావిష్కరణకు కొన్ని నిమిషాల ముందు పుస్తక ప్రచురణ సంస్థ బ్లూమ్స్ బరీ ఒక ట్విట్టర్ సందేశంలో “ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకుంటున్నాం” అని తెలిపి బాంబు పేల్చింది. లండన్లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంపై  భారతదేశ వామ’పక్షీయులు, ఉదారవాదులు (లిబరల్స్)  తీవ్ర ఒత్తిడి తెచ్చి చివరి క్షణంలో ఆ పుస్తక ప్రచురణను ఉపసంహరించుకునేలా చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ అభిప్రాయం చెప్పే హక్కు అందరికీ ఉంటుందన్న ప్రాథమిక అంశాన్ని వామపక్ష శక్తులు –  లిబరల్స్  విస్మరించి ఇలాంటి చర్యకు పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారం లేవగా తాజాగా “గరుడ ప్రకాశన్” అనే మరో ప్రచురణ సంస్థ ఆ పుస్తకాన్ని ఆంగ్లంలోనే కాదు, ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ప్రచురిస్తామని ముందుకు రావడం గమనార్హం.  ఇప్పుడు లిబరల్స్ ఆ పుస్తక ప్రచురణను  ఆపలేరు. మార్కెట్ లోకి రాకుండా నిలువరించనూ లేరు.  ఆ మాత్రం దానికి ఇంత రాద్ధాంతం అవసరమా? ఒకరకంగా ఆ పుస్తకానికి ఉచిత ప్రచారం కల్పించడమే తప్ప ఒరిగిందేమీ లేదు. హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, భావ ప్రకటన…..  ఇలా పదకోశంలోని కీలక పదాలను  ముందుకు తెచ్చి ఉద్యమించే వారు ఇలా ఇతరుల స్వేచ్ఛను, హక్కును భావ వ్యక్తీకరణను కాల రాసేందుకు ఓవర్ టైం పనిచేయడం విడ్డూరం.

పౌరసత్వ సవరణ చట్టం (CAA) ను వ్యతిరేకిస్తూ వీరు దేశవ్యాప్తంగా ఆందోళన సృష్టించిన సంగతి తెలిసిందే. విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు ఒకడుగు ముందుకేసి హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. ముఖ్యంగా జామియా మిలియా  విశ్వవిద్యాలయం విద్యార్థుల హింసాకాండ హద్దు మీరింది.  షాహీన్ బాగ్ నిరసన శిబిరం ఒక మినీ పాకిస్థాన్ ను తలపించింది. షర్జిల్ ఇమామ్ అనే విద్యార్థి అసోం  రాష్ట్రాన్ని దేశం నుంచి విడదీయాలని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు. ఇంకా ఎందరో భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టాలని తీవ్ర స్వరంతో పిలుపునిచ్చారు. పిల్లల చేత దేశ ప్రధానిని,  హోం మంత్రిని తిట్టించారు. ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగిందని,  మెట్రో నగరాల్లో షాహీన్ బాగ్ బ్రాంచిలు  వెలశాయని అందరికీ తెలిసిందే.

ఈ ఆందోళనలు, అల్లర్ల వెనుక మావోయిస్టు ( అర్బన్ నక్సల్స్)  ప్రమేయమున్నదని,  వారి కుట్ర దాగి ఉందని చాలా రోజులుగా వినిపిస్తున్న మాట.  అర్బన్ నక్సల్స్ గా ఉన్న మావోలు  తమ “ఎజెండా” ను  అమలు జరిపేందుకు క్రియా శీలకంగా పని చేశారు.  “ఎక్కడ ఉద్యమం ఉంటే అక్కడ మావోయిస్టు ఉండాలి” అన్నది ఆ పార్టీ విధానం. ఆ పాలసీ ప్రకారమే అర్బన్ నక్సల్స్ CAA  వ్యతిరేక ఆందోళనలలో  కీలక పాత్ర పోషించారు. సర్కారును బలహీనపరచి తాము బలపడాలన్న”ఎత్తుగడ”తోనే ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించారు. చివరికి నిఘా అధికారి అంకిత్ శర్మ హత్యకు ప్రేరేపించారు. భావసారూప్యత గల శక్తులతో, వ్యక్తులతో ఏకమై పెద్ద ఎత్తున హింసాకాండకు తోడ్పాటునందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత తాహిర్ హుస్సేన్ లాంటి వాళ్లకైతే అసలు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అతని ఇంట్లో  ఆయుధాలు,  బాంబులు లభ్యమైన సంగతి మరువరాదు. ఉన్మాదంతో చెలరేగిన శక్తుల కారణంగా కోట్లాది రూపాయల ఆస్తి బుగ్గిపాలయింది. ఎన్నో విలువైన వస్తువులు ధ్వంసమయ్యాయి. ఈ మూక ఉద్యమం వల్ల ఒరిగిందేమిటి? CAA  ఆగిపోయిందా?  పోనీ CAA వల్ల ఏ ఒక్క భారత పౌరుడైనా తన పౌరసత్వాన్ని కోల్పోయాడా?  లేదే? కానీ అల్లర్ల కారణంగా 53 మంది శవాలు మిగిలాయి కదా? మరి అర్బన్ నక్సల్స్,  మత ఛాందసవాదులు,  ఇస్లాం రాడికల్స్ తమ ఉద్యమం ద్వారా ఏం సాధించినట్లు?

వారి నిర్వాకాన్ని ప్రశ్నిస్తూ వ్రాసిన పుస్తకాన్ని సైతం ఆ శక్తులు వెలుగు చూడకుండా  సర్వ శక్తులను ఒడ్డటం విచిత్రం. అంతా తాము అనుకున్నట్టే జరగాలన్న భావన ప్రజాస్వామ్యంలో ఏ మాత్రం సముచితం కాదు. అటు దండకారణ్యంలో, ఇటు జనారణ్యంలో విధ్వంసం సృష్టిస్తూ రాజ్యాధికార కలలు కనడం కాలం చెల్లిన విధానం తప్ప కాలానుగుణమైన వైఖరి ఏమాత్రం కాదు. ఇదే పుస్తక ప్రచురణ సంస్థ చేత “షాహీన్ బాగ్ ఫ్రం ప్రొటెస్ట్ టు మూమెంట్” అన్న పుస్తకాన్ని  ప్రచురింపజేశారు. ఇంకా తమకు అనుకూలమైన అనేక పుస్తకాలను ఆ సంస్థ నుంచే ప్రచురింపజేసుకున్నారు. అవన్నీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి ఉపసంహరణకు ఎవరూ వత్తిడి చేయలేదు. బెదిరింపులకు పాల్పడ లేదు. కానీ ఢిల్లీ అల్లర్ల పై నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ఆధారంగా,  సాధికారిక సమాచారంతో బాధితుల ఇంటర్వ్యూలతో,  మీడియాలో వచ్చిన ఫోటోలతో ఒక పుస్తక  ప్రచురణ జరిగితే… దానికి ఇంత హంగామా చేయాలా?  ఎక్కడ తమ నిజస్వరూపం బయట పడుతుందోనని కంగారా?  ఎనిమిది అధ్యాయాలున్న ఒక్కగానొక్క పుస్తకంపై ఇంత పెద్ద రభస ఎందుకు?  సత్యాలు, వాస్తవాలు వెలుగు చూస్తే జరిగే నష్టం ఏముంటుంది?  ఇలాంటివి మహారాష్ట్రలోనూ మరికొన్ని చోట్ల కూడా జరిగిన సంగతి ప్రపంచానికి తెలుసు. అయినా అర్బన్ నక్సల్స్ లో ఆత్మవిమర్శ చోటు చేసుకుందా?  లేదు. CAA  పై ఏ మాత్రం చప్పుడు లేని ఈ సమయంలో ఇలా లొల్లి ఎందుకు? నిజాల నిగ్గు తేల్చే ఆ పుస్తకమంటే వామ పంథీయులకు అంత భయమెందుకు?

వుప్పల నరసింహం, సీనియర్ జర్నలిస్ట్, 9985781799.

ఆంధ్రప్రభ సౌజన్యంతో…

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.