
దేశ చరిత్రలోనే తొలిసారిగా భారతీయ నేవీ సరికొత్త మైలురాయిని చేరుకుంది. యుద్ధ నౌకల్లో ఉండే అత్యాధునిక మల్టీరోల్ హెలికాప్టర్లలో సేవలందించేందుకు ఇద్దరు మహిళలకు అవకాశం దక్కింది. సబ్ లెఫ్టినెంట్ త్యాగి, సబ్ లెఫ్టినెంట్ రితి సింగ్‌లకు భారత నేవీ సోమవారం పోస్టింగ్‌లు జారీ చేసింది. వారిద్దరూ కొచ్చిలోని దక్షిణ నావల్ కమాండ్ నుంచి నేవీ నిఘా విభాగంలో ఉత్తీర్ణులయ్యారు. ఇక నుంచి వారు యుద్ధనౌకల్లో ఎంహెచ్ 60ఆర్ హెలికాప్టర్‌ల బాధ్యతలను తీసుకోనున్నారని.. వాటితో సముద్ర జలాలపై పర్యవేక్షిస్తూ శత్రు దేశాల ఓడల్ని పసిగట్టాల్సి ఉంటుందని నేవీ వెల్లడించింది. ఈ నూతన అధ్యాయం భవిష్యత్తులో మరింత మంది మహిళలు యుద్ధ నౌకల్లో చేరేందుకు మార్గం సుగమం చేస్తుందని నేవీ తెలిపింది.

కొత్తగా పోస్టింగ్ అయిన ఇద్దరు అధికారిణుల్లో రితిసింగ్ హైదరాబాద్‌కు చెందిన వారు కాగా, త్యాగి ఘజియాబాద్‌కు చెందినవారు. ఈ సందర్భంగా రితి సింగ్ మాట్లాడుతూ.. ‘భారత సాయుధ దళాల్లో మా కుటుంబం నుంచి సేవలు అందిస్తున్న వారిలో నాది మూడో తరం. మా తాత ఆర్మీలో, నాన్న నేవీలో సేవలందించారు. భారత నేవీలో సేవలందించాలనేది ఎప్పటి నుంచో నా ఆశయం’ అని తెలిపారు. మరో అధికారిణి త్యాగి ఘజియాబాద్‌కు చెందిన వారు. ఈ సందర్భంగా త్యాగి మాట్లాడుతూ.. ‘నేను 2015లో నేవీ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదంలో మరణించిన మహిళా లెఫ్టినెంట్ కిరణ్ షెఖావత్ నుంచి నేవీలోకి వచ్చేందుకు ప్రేరణ పొందాను. నేవీలో ఉండే సవాళ్లను ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని వెల్లడించారు.
కాగా భారత వైమానిక దళంలోనూ 1875 మంది మహిళలు సేవలందిస్తుండగా.. వారిలో 10 మంది యుద్ధవిమానాలకు పైలట్లుగా వ్యవహరిస్తున్నారు. వారిలో ఒకరు ఇటీవలె రఫేల్ యుద్ధవిమానానికి పైలట్‌గా నియామకం అయినట్లు ఐఏఎఫ్ తెలిపింది.





