News

ఇక నుంచి భాజపాతోనే నా పయనం – మాజీ నేవీ అధికారి మదన్ శర్మ

522views

ముంబయిలో శివసేన కార్యకర్తల చేతిలో దాడికి గురైన నేవీ మాజీ అధికారి మదన్‌ శర్మ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తాను భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లతో ఉంటానని అన్నారు. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘శివసేన కార్యకర్తలు నాపై దాడి చేసేటప్పుడు నేను భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారుడినని ఆరోపణలు చేశారు. ఇప్పుడు చెబుతున్నా నేను ఇక నుంచి భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లతో ఉంటా. నాపై జరిగిన దాడి గురించి గవర్నర్‌కు వివరించా. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరా’ అని మదన్‌ శర్మ తెలిపారు.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రేను ఎగతాళి చేసే విధంగా ఉన్న ఫొటోను వాట్సాప్‌లో పంపినందుకు నేవీ మాజీ అధికారి మదన్‌పై పలువురు శివసేన కార్యకర్తలు దాడికి దిగిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు. వారి విడుదలను ఖండిస్తూ.. ఆయన కుటుంబీకులు అదనపు కమిషనర్‌ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా ఘటనపై స్పందించిన కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. మాజీ సైనికులపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.