
కళలు అంతరించిపోవడం కొందరికి నచ్చదు. అందుకే దాన్ని రక్షించడానికి నడుం బిగించి ముందుకు సాగుతారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే బిహార్‌లోని ముజఫర్‌పుర్‌కు చెందిన డాక్టర్ కాంచన్ ప్రకాశ్. ఆమె అంతరించిపోయే దశకు చేరుకున్న సంప్రదాయ కళ ‘బజ్జికా పెయింటింగ్స్’ ఉనికిని కాపాడుతున్నారు. దేశవిదేశాల్లో ఆ పెయింటింగ్స్‌కు మంచి పేరును తెచ్చిపెడుతున్నారు. అందు కోసం కార్పొరేట్ ఉద్యోగానికి సైతం గుడ్‌బై చెప్పేశారు. ఇంతకీ ‘బజ్జికా పెయింటింగ్స్’ అంటే ఏమిటి? దానికున్న చరిత్ర ఏంటి? తదితర విషయాలు తెలుసుకుందాం.
గత 25 ఏళ్లుగా కృషి
బజ్జికా పెయింటింగ్ అనేది ముజఫర్‌పుర్ పక్కన ఉన్న బజ్జికాంచల్ ప్రాంతానికి చెందిన పురాతనమైన జానపద కళ. ఒకప్పుడు వివాహాలు, శుభకార్యాల సమయంలో గ్రామాల్లోని ఇళ్ల మట్టి గోడలపైనే ఈ చిత్రాలను (బజ్జికా పెయింటింగ్స్) గీసేవారు. కాలక్రమేణా మట్టి ఇళ్ల స్థానంలో కాంక్రీటు భవనాలు రావడంతో ఈ కళ కనుమరుగవ్వడం ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఈ బజ్జికా పెయింటింగ్స్‌ను కాన్వాస్‌పై తీర్చిదిద్దుతున్నారు. ఈ కళను కాపాడేందుకు డాక్టర్ కాంచన్ ప్రకాశ్ గత రెండున్నర దశాబ్దాలుగా తీవ్రంగా కృషి చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపైకి ఈ కళను తీసుకెళ్లారు.
గత 20- 25 ఏళ్లుగా ఈ జానపద కళను పరిరక్షించడానికి తాను పూర్తిగా అంకితమయ్యానని డాక్టర్ కాంచన్ ప్రకాశ్ తెలిపారు. మొదట్లో తన ఇంటి గోడలపై, సంప్రదాయ కార్యక్రమాల సమయంలో ఈ చిత్రాలను రూపొందించేదానినని చెప్పారు. కానీ ఈ కళారూపానికి ఒక కొత్త మాధ్యమం లభించకపోతే రానున్న తరాలకు ఈ పెయింటింగ్ చేరదని గ్రహించానని వెల్లడించారు. ఈ ఆలోచనతో తాను సంప్రదాయ వాటర్ కలర్స్ ఉపయోగించి కాన్వాస్‌పై బజ్జికా పెయింటింగ్స్‌ను రూపొందించడం ప్రారంభించానని పేర్కొన్నారు.
“నేను బజ్జికా పెయింటింగ్స్ గీయడం మొదలుపెట్టినప్పడు సోషల్ మీడియా యుగం ఇంకా రాలేదు. ఫలితంగా మా కళ పరిమిత సంఖ్యలో ఉన్న ప్రజలకు మాత్రమే చేరువయ్యేది. నేడు సోషల్ మీడియా పుణ్యమా అని మా కళ దేశ, విదేశాల్లోని ప్రజలకు చేరుతోంది. అలాగే బజ్జికా పెయింటింగ్ కళాకారులు కొత్త గుర్తింపును పొందుతున్నారు. మా అమ్మ, అమ్మమ్మ నుంచి ఈ విద్యను నేర్చుకున్నాను” అని కాంచన్ ప్రకాశ్ స్పష్టం చేశారు.
దేశ విదేశాల్లో బజ్జికా పెయింటింగ్స్‌కు గుర్తింపు
అయితే ప్రస్తుతం కాంచన్ ప్రకాశ్ గీసిన బజ్జికా పెయింటింగ్స్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఆమె రూపొందించిన కొన్ని ఎంపిక చేసిన బజ్జికా పెయింటింగ్స్‌ను రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించారు. అంతేకాకుండా బెల్జియంలోని ‘మ్యూజియం ఆఫ్ సేక్రేడ్ ఆర్ట్’, ‘బిహార్ మ్యూజియం’, ‘బిహార్ కళా అకాడమీ’ వంటి అనేక ప్రతిష్టాత్మక వేదికలపై ఆమె కళాఖండాలు ప్రదర్శితమయ్యాయి. మరోవైపు, బజ్జికా పెయింటిగ్స్‌లో రాణించినందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అందించే CCRT సీనియర్ ఫెలోషిప్, ఏఐఎఫ్‌సీఎస్ అవార్డు, బిహార్ స్టేట్ అవార్డు, కుముద్ శర్మ సీనియర్ కాంటెంపరరీ ఉమెన్ ఆర్టిస్ట్ అవార్డు వంటివి కాంచన్‌ను వరించాయి. కాంచన్ ప్రకాశ్ మార్గదర్శకత్వంలో అనేకమంది యువ కళాకారులు బజ్జికా పెయింటింగ్స్ గీయడం నేర్చుకుని స్వయం సమృద్ధిని సాధించారు. ఒకప్పుడు గ్రామీణ గోడలకే పరిమితమైన ఈ చిత్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇళ్లు, ఆర్ట్ గ్యాలరీలకు చేరుతున్నాయి.
సంప్రదాయ జానపద కళ
ముజఫర్‌పుర్, వైశాలి, సీతామర్హి, షెయోహర్, తూర్పు చంపారన్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ప్రాంతాన్ని బజ్జికాంచల్ అంటారు. అక్కడ బజ్జికా పెయింటింగ్స్ ఒకప్పుడు చాలా పాపులర్. బజ్జికా పెయింటింగ్స్ కేవలం అలంకరణకు మాత్రమే పరిమితమైనవి కాదు. ఇవి జానపద కళ, మత విశ్వాసం, వివాహ ఆచారాలు, వ్యవసాయ సంస్కృతి, ప్రకృతి, సామాజిక విలువలకు దృశ్యరూపం. బజ్జికాంచల్ ప్రాంతంలో పెళ్లికి ముందు చేసే మత్కోర్ పూజ సమయంలో మహిళలు ఇంటి గోడలపై ఈ పెయింటింగ్స్‌ను వేసేవారు. ఈ చిత్రాల్లో వెదురు, ఏనుగులు, పక్షులు, చేపలు, పువ్వులు, ఆకులు, ఇతర శుభ చిహ్నాలు ఉంటాయి. వెదురు వంశ వృద్ధికి, శ్రేయస్సుకు, ఆనందానికి ప్రతీక అని అక్కడి ప్రజల నమ్మకం. అందువల్ల పెళ్లి సందర్భంగా వెదురు ఫొటోలను చిత్రీకరిస్తారు.
బజ్జికా చిత్రకళలోని అత్యంత విశిష్ఠమైన లక్షణమేమిటంటే సహజ రంగుల వాడకం. గ్రామాల్లోని మహిళలు మట్టి, ఆవు పేడ మిశ్రమంతో ఈ పెయింటింగ్స్‌ను వేసేవారు. ఆ తర్వాత ఎరుపు రంగును పువ్వుల నుంచి, ఆకుపచ్చను ఆకుల నుంచి, పసుపు కలర్‌ను పసుపు నుంచి, తెలుపును బియ్యపు పిండి పేస్టు నుంచి సేకరించి పెయింటింగ్స్‌కు అద్దేవారు. ఈ సహజ రంగులతో సృష్టించిన చిత్రాలు సరళతను, స్వచ్ఛతను, ప్రకృతితో ఉన్న గాఢమైన అనుబంధాన్ని ప్రతిబింబిస్తాయి. నేటి కళాకారులు చిత్రాలను తీర్చిదిద్దేందుకు కాన్వాస్‌లను, ఆధునిక రంగులను ఉపయోగిస్తున్నప్పటికీ ఈ కళ ప్రాథమిక శైలి, ఇతివృత్తాలు మారలేదు.





