
భారతీయుల సమాచారం అంతా చైనాకు చేరుతోందా..? అవుననే అంటున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. భారత్-చైనా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి వార్తలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే చైనాకు సంబంధించిన 200 యాప్ లను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, 72 సర్వర్ల ద్వారా భారతీయుల సమాచారం తస్కరణకు గురై చైనాకు అందుతున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. వీటన్నింటికి చైనీస్ సంస్థ ‘అలీబాబా’ క్లౌడ్ డేటా సర్వర్‌తో అనుసంధానం కలిగి ఉన్నట్లు పేర్కొన్నాయి. వ్యాపార రంగానికి సంబంధించి అలీబాబా సర్వర్లు ఎంతో ప్రాచుర్యం పొందాయి. యూరోపియన్ దేశాల సర్వర్ల కంటే అలీబాబా సంస్థ అందించే సర్వర్ల సేవలు తక్కువ ధరకే లభిస్తాయి. దీంతో ఎక్కువమంది వ్యాపారవేత్తలు తమకు అవసరమైన డేటా సర్వర్ల సేవలను అలీబాబా నుంచి పొందుతుంటారు. అయితే భారత్ వినియోగదారుల సమాచారం తస్కరించి సొంత దేశం చైనాకు చేరవేస్తుందనే ఆరోపణలు అలీబాబా సంస్థపై రావడంతో సైబర్ నిపుణులు అప్రమత్తమయ్యారు.
అలీబాబా సంస్థ దేశంలో 72 సర్వర్లను నిర్వహిస్తోందని, భారతీయుల సమాచారం చైనాకు వెళ్తున్నట్లు గుర్తించామని ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇదంతా చైనా అధికారుల ఆధ్వర్యంలో ఓ ప్రణాళిక ప్రకారం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారులను తమ ట్రాప్‌లో పడేసేందుకు ఫ్రీ ట్రైయల్స్ వంటి ఆఫర్లను సదరు సర్వర్లు ఇచ్చేవని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఒక్కసారి యూజర్లుగా మారిపోతే చైనాలో ఉండే రిమోట్ సర్వర్ల ద్వారా అనుసంధానమైపోతారు. అప్పుడు వ్యక్తిగత, వ్యాపార సమాచారమంతా లాగేసుకునే వెసులుబాటు ఇచ్చేసినట్లు అవుతుంది. సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులతో పాటు సైబర్ వార్‌కు చైనా సిద్ధమవుతోందనే అనుమానాలు వస్తున్నాయి. దీనిని గుర్తించిన భారత ప్రభుత్వం త్వరలోనే దీనిపై పెద్ద ఎత్తున విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.





