
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనుకబడ్డ, బలహీన దేశాల ఆశా నిలయం అని కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ పాట్రీషియా స్కాట్లాండ్ అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ బడుగు దేశాలకు అండగా నిలిచిందని.. తద్వారా ప్రపంచ నాయకత్వ దిశగా పురోగమిస్తోందని ఆమె అభివర్ణించారు. ‘ఇండియా-యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ పార్ట్‌నర్‌షిప్ ఫండ్’ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం జరిగిన ఓ అన్‌లైన్ సమావేశంలో ఆమె ప్రసంగించారు. కామన్వెల్త్ దేశాల సహాయ చర్యలకు ఊతమిచ్చేందుకు ముందుకొచ్చి ఈ నిధిని ఏర్పాటు చేసినందుకు ఆమె మోదీకి కృతజ్ఞతలు తెలియచేశారు.
కామన్వెల్త్ దేశాల్లో చేపట్టే వివిధ అభివృద్ధి పథకాలకు సాయం అందించేందుకు భారత్ 2017లో ఈ నిధిని ఏర్పాటు చేసింది. దీనికి ఏటా 100 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించడమే కాకుండా.. ప్రత్యేకించి చిన్న, వెనుకబడిన దేశాలకు ‘కామన్వెల్త్ విండో పథకం’ కింద మరో 50 మిలియన్ డాలర్లను కూడా కేటాయించింది.
”ప్రపంచంలోని 34 చిన్న, వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు కామన్వెల్త్ సమాఖ్యలో భాగంగా ఉన్నాయి. వీటికి సహాయం చేయటమే లక్ష్యంగా భారత్ ఈ నిధిని ఏర్పాటు చేయటం ఎంతో అత్యవసరం, అభినందనీయం. ప్రస్తుతం అన్ని దేశాలు విపత్కర పరిస్థితిలోనే ఉన్నా.. ఈ నిధి ఏర్పాటు ద్వారా భారత్ ఉన్నత విలువలకు, ఆశావాదానికి ప్రతీకగా నిలిచింది. ప్రపంచ నాయకత్వం దిశగా భారత్ ముందుకు సాగుతోందనే విషయం ఈ నిధి ఏర్పాటుతో స్పష్టమైంది. ఇది సభ్యదేశాల ఆశలకు నిలయమైంది” అని సెక్రటరీ జనరల్ పాట్రీషియా స్కాట్లాండ్ ప్రకటించారు.





