News

దేశం మొత్తం సైన్యం వెంటే – రక్షణమంత్రి రాజ్ నాథ్

588views

భారత్‌ – చైనా సరిహద్దుల్లో నెలకొంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో లద్దాఖ్‌ వద్ద పరిస్థితులపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభలో ప్రకటన చేశారు. లద్దాఖ్‌లో 1962లో చైనా వేల కి.మీల భూభాగం ఆక్రమించిందన్నారు. చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. 90వేల చదరపు కి.మీల భారత భూభాగాన్ని డ్రాగన్‌ ఆక్రమించిందని సభకు వెల్లడించారు. గల్వాన్‌ ఘర్షణల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్‌ వెళ్లి సైనికులను కలిశారని గుర్తు చేశారు. లద్దాఖ్‌ వద్ద చైనా ఏకపక్షంగా సరిహద్దులను మార్చాలన్న కుతంత్రాన్ని మన సైన్యం తిప్పికొట్టిందని చెప్పారు. తీవ్ర కఠిన పరిస్థితుల్లో మన సైన్యం చైనా ఆక్రమణలను అడ్డుకుందని చెప్పారు. సరిహద్దు సమస్య తేలేవరకు ఎల్‌ఏసీని గౌరవించాలన్న నిర్ణయాన్ని చైనా పదేపదే ఉల్లంఘిస్తోందన్నారు. మే నుంచి సరిహద్దుల్లో భారీగా ఆయుధాలను, సైన్యాన్ని మోహరిస్తోందన్న ఆయన.. భారత్‌ కూడా తగిన రీతిలో సైన్యాన్ని తరలించిందన్నారు. చైనా ఏకపక్ష చర్యల్ని ఖండిస్తున్నామన్నారు. ఆగస్టులో భారత్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిందని చెప్పారు. సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడిందని.. చైనా దుశ్చర్యలను మన సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని చెప్పారు. చైనా దూకుడు చర్యలతో శాంతి ఒప్పందంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.

స్నేహపూర్వక బంధమే కోరుకుంటున్నాం..

డ్రాగన్‌ సాయుధ బలగాలకు భారత్ కూడా తగిన రీతిలో బదులిచ్చిందన్నారు. ఎల్‌ఏసీని రెండు దేశాలూ గౌరవించాలన్నారు. చైనా కదలికలను నిరంతరం గమనిస్తున్నామని చెప్పారు. సరిహద్దుల నిర్ణయానికి చైనా ఒప్పుకోవడంలేదన్న రాజ్‌నాథ్‌ సింగ్‌.. ఎల్‌ఏసీ విషయంలో ఇరు దేశాల మధ్య వివాదాలు ఉన్నాయని చెప్పారు. చైనాతో ద్వైపాక్షిక బంధం పెంచుకొనేందుకు ఎంతో ప్రయత్నించామన్నారు. చైనాతో తమ ప్రభుత్వం స్నేహపూర్వక సంబంధాలే కోరుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. సరిహద్దుల విషయంలో మంచి పరిష్కారం కోరుకుంటున్నట్టు రాజ్‌నాథ్‌ సభకు తెలిపారు.

దేశం మొత్తం సైన్యం వెంటే..

”సరిహద్దుల్లో చైనా హింసాత్మక ఘటనలకు పాల్పడింది. మన సైన్యం చైనా దుశ్చర్యలను సమర్థంగా తిప్పికొట్టింది. 1993, 96 ఒప్పందాలను చైనా ఉల్లంఘించింది. సరిహద్దులో బలగాలను మరింత పెంచాం. సరిహద్దుల్లో శాంతి నెలకొనేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్‌తో కలిసి నడవాలని చైనాను కోరుతున్నాం. సార్వభౌమత్వం విషయంలో రాజీపడే ప్రసక్తేలేదు. సరిహద్దుల్లో మౌలిక వసతులు కల్పించాం. దేశం మొత్తం సైన్యం వెంటే ఉంది.

చైనా కుట్రల్ని సైన్యం తిప్పికొట్టింది

ఆగస్టు 29, 30 తేదీల్లో రాత్రి పూట చైనా చేసిన దుష్ట ప్రయత్నాన్ని మన సైన్యం తిప్పికొట్టింది. సరిహద్దులో శాంతి నెలకొనాలన్నదే భారత్‌ ఉద్దేశం. 1993, 1996 ఒప్పంద సారాంశం కూడా అదే. భారత్‌ ఎప్పుడూ శాంతి, సామరస్యమే కోరుకుంటుంది. సంప్రదింపులు, చర్చల ద్వారా పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. రష్యాలో జరిగిన సమావేశంలో చైనా రక్షణ మంత్రికి ఈ విషయాన్ని స్పష్టంచేశాం” అని సభకు తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.