
శ్రీశైలం క్షేత్రంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయ రథం భద్రతను ఈవో కె.ఎస్.రామారావు, ఈఈ మురళీ బాలకృష్ణ సోమవారం పరిశీలించారు. తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతర్వేదిలో రథం అగ్నికి ఆహుతయిన నేపథ్యంలో శ్రీశైలం మల్లన్న రథం భద్రతకై పటిష్ట చర్యలు చేపట్టాలని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావును ఈవో ఆదేశించారు. పరిసర ప్రాంతాలలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల కవరేజ్ అన్ని కోణాల్లో ఉండే విధంగా మార్పు చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు. గంగాధర మండపం వద్ద విధులు నిర్వర్తించే సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. రథశాలకు అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఈఈ మురళీ బాలకృష్ణను ఆదేశించారు. తర్వాత సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. క్షేత్ర ప్రవేశ మార్గం టోల్‌గేట్ వద్ద లగేజీ స్కానర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని ఈవో ఇంజినీర్లకు సూచించారు. సెక్యూరిటీ, హోంగార్డు సిబ్బంది విధులు నిర్వర్తించే ప్రదేశాల్లో భక్తులు కోరే సమాచారాన్ని తెలియజేయాలన్నారు.
భక్తులతో పూర్తి మర్యాదతో మెలగాలని ఆదేశించారు. ముఖద్వారం, హటకేశ్వరం, సాక్షిగణపతి, టోల్‌గేట్ వద్ద సూచికలు, సూచన బోర్డులు ఏర్పాటు చేయాలని ఎడిటర్ అనిల్‌కుమార్‌ను ఆదేశించారు. వారాంతంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున క్రమబద్దీకరణకు సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.





