
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని చారిత్రాత్మకమైన రథాన్ని గుర్తు తెలియని దుండగులు తగులబెట్టిన ఘటన మరువకముందే కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలంలో కూడా హిందూ భక్తులను కలచివేసే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…. బేతంచెర్ల పరిధిలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీ ముచ్చట్ల మల్లికార్జున స్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు గుప్తనిధుల కోసం ధ్వజస్తంభాన్ని పెకలించారు. ఘటనపై ఆలయ ఈవో మద్దిలేటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ కేశవ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న వారి వివరాలను, అక్కడ ఉన్న ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే పుణ్య క్షేత్రం జనావాసాలకు దూరంగా, ఎర్రమల అడవుల్లో ఉండడంతో దుండగులు గతంలో కూడా గుప్తనిధుల కోసం తవ్వకాలకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. కావున ఇప్పటికైనా దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.





