
950views
జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీనిలో ఓ ఉగ్రవాది హతమైనట్లు కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలిని భద్రతాదళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని చిత్రాగమ్ గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయి. ఉగ్రవాదులను గుర్తించేందుకు ఆ గ్రామాన్ని చుట్టుముట్టాయి. ఆ సమయంలోనే ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపై కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించినట్లు అక్కడి పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఒక ఉగ్రవాది హతమైనట్లు ప్రకటించారు. అయితే అతను ఏ సంస్థకు చెందినవాడనే విషయం తేలాల్సి ఉందన్నారు.





