
ఇటీవల కరోనా బారిన పడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇప్పుడు కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు తెలిపారు. దేవుడి దయతోనే కోలుకున్నానని పేర్కొన్నారు. తాను ఆరోగ్యంగా ఉండాలని కోరిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నెల 2న తనకు కరోనా సోకినట్లు అమిత్‌షా స్వయంగా వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చిందంటూ ఈ నెల 9న బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ట్వీట్ చేయగా ఆయనకు ఎలాంటి పరీక్షలూ నిర్వహించలేదని హోంశాఖ వర్గాలు అప్పుడు స్పష్టం చేశాయి. ఆ వెనువెంటనే తివారీ కూడా తన ట్వీట్ ను తొలగించారు కూడా. కాగా తనకు కరోనా నెగెటివ్ వచ్చినట్లుగా ఇప్పుడు స్వయంగా హోం మంత్రే ట్విట్టర్ ద్వారా తెలియజేయడం విశేషం.





