
అయోధ్యలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న శ్రీరామ మందిరం భూమిపూజకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఈ ఆలయానికి భూమిపూజ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ మహా ఘట్టానికి ఇంకా కొద్ది గంటల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో భాజపా అగ్రనేత ఆడ్వాణీ భావోద్వేగ సందేశంతో కూడిన ప్రకటన జారీ చేశారు. తనతో పాటు భారత ప్రజలందరికీ ఇదో చారిత్రక, ఉద్వేగభరిత క్షణమన్నారు. 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు తాను చేపట్టిన రథయాత్రను ఆయన గుర్తు చేసుకున్నారు.
దృఢమైన, సుసంపన్నమైన, శాంతి, సామరస్యంతో కూడిన భారతావనికి రామ మందిరం ఓ ప్రతీకగా నిలుస్తుందని ఆడ్వాణీ విశ్వాసం వ్యక్తంచేశారు. అందరికీ సమ న్యాయం, సుపరిపాలన అందాలని, దేశం రామ రాజ్యంలా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రామజన్మభూమి ఉద్యమంలో భాగస్వామి కావడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, నాగరిక వారసత్వంలో శ్రీరాముడికి ఎంతో గౌరవ స్థానం ఉందన్నారు. భారతీయులందరిలో శ్రీరాముడిలోని సద్గుణాలు ప్రేరేపించేందుకు ఈ ఆలయం దోహదపడుతుందని నమ్ముతున్నానన్నారు. కరోనా నేపథ్యంలో 93 ఏళ్ల ఆడ్వాణీ ఈ వేడుకకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.





