News

ఆగస్టులో ప్రారంభమవనున్న అయోధ్య రామమందిర నిర్మాణం

1.1kviews

యోధ్యలో రామమందిరం నిర్మాణంపై శనివారం సాయంత్రం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆగస్టులో భూమిపూజ నిర్వహించాలని తీర్మానించారు. ప్రధాని నరేంద్ర మోడీ భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. ప్రధాని వచ్చే వీలును బట్టి ఆగస్టు 3న లేదా 5వ తేదీన భూమి పూజకు సన్నాహాలు చేస్తున్నారు. అయోధ్య రామమందిరం ప్రాంతంలో ప్రధాని మోడీ మొదటి పర్యటన ఇదే కానుంది. ‘ఆగస్టు 3 లేదా 5వ తేదీన రామమందిరం భూమి పూజకు రావాలని ప్రధాని మోడీకి విన్నవించాం. పూజ చేసిన రోజే నిర్మాణ పనులను ప్రారంభించనున్నాం’ అని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారి ఒకరు వెల్లడించారు.

ట్రస్టు సమావేశానికి అనేక మంది ట్రస్టు సభ్యులు హాజరు కాగా ముగ్గురు సభ్యులు.. వీడియో సమావేశంలో పాల్గొన్నారు. ‘లార్సెన్‌ అండ్‌ టర్బో సంస్థ పరీక్షల కోసం మట్టి నమూనాలను సేకరిస్తోంది. ఆలయ నమూనాలను సిద్ధం చేస్తోంది. అవి సిద్ధమవగానే వాటి ఆధారంగా ఆలయాన్ని నిర్మించనున్నాం’ అని ట్రస్టు జనరల్‌ సెక్రటరీ చంపత్‌రాయ్‌ తెలిపారు. వర్షాకాలం తర్వాత దేశంలోని నాలుగు లక్షల ప్రాంతాల్లో 10 కోట్ల కుటుంబాలను సంప్రదించనున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక విరాళాలు సేకరించనున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యేసరికి 3 నుంచి 3.5 సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.