ArticlesNews

యోధుడిలా జీవించి… యోధుడిలా దివికేగిన రాంప్రసాద్ బిస్మిల్!

984views

ఆంగ్లేయుల పాల‌నాకాలమది!… లక్నోలో కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నాయి. అక్కడికి చేరుకున్న ఒక యోధుడికి కొందరు విప్లవకారులు పరిచయమయ్యారు. ఆ యోధుడు విప్లవకారుల‌ కమిటీకి సభ్యుడయ్యాడు. కమిటీ కార్యకలాపాలు చురుగ్గా జరగాలంటే, ధనం అవసరం. ఆ యోధుడి మెదడులో మెరుపులా ఓ ఆలోచన మెరిసింది. విప్లవ సాహిత్యాన్ని ప్రచురించి అమ్మితే కమిటీ ఆశయాల‌కు ప్రచారం కలిగించినట్లూ ఉంటుంది, ధనమూ ల‌భిస్తుందని… తల్లి దగ్గర రూ.400 అప్పు చేశాడు. అమెరికాకు స్వాతంత్య్రం ఎలా వచ్చింది?అనే పుస్తకాన్ని ప్రచురించాడు. అదే సమయంలో జిందాలాల్ దీక్షిత్ అనే విప్లవకారుడికి ఆంగ్లేయులు గ్వాలియర్లో జైలు శిక్ష విధించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా వ్యాపించాల‌ని దేశప్రజల‌కో సందేశంఅన్న శీర్షికతో ఒక కరపత్రాన్ని ప్రచురించాడు. తన సాహిత్య విక్రయం ద్వారా అందిన పైకంతో అప్పుతీర్చుకోవడమే కాకుండా రూ. 200 రూపాయల‌ లాభాన్ని గడించాడు. ఆంగ్లేయుల‌ గుండెల్లో నిద్రపోయిన ఆ యోధుడే…. రాంప్రసాద్ బిస్మిల్!

తల్లిదండ్రులు మురళీధర్, మూలమతీ దేవి

 ఉత్తరప్రదేశ్, షాజహాన్పూర్లో 1897 జూన్ 11వ తేదీన మురళీధర్, మూలమతీ దేవి పుణ్యదంపతుల‌కు రాంప్రసాద్‌ జన్మించాడు. అతని పూర్వీకులు గ్వాలియర్ సంస్థానంలోని ధోమర్గడ్ కు చెందినవారు. చంబల్ నదీ తీర ప్రాంతాల్లో ఉన్న పల్లెల్లో ఆంగ్లేయులు అడుగుపెట్టలేకపోయారు. రాంప్రసాద్  జన్మించినది అటువంటి గ్రామమే. ఏడవ ఏటనే తండ్రి హిందీ నేర్పాడు. ఉర్దూలో నాలుగో తరగతి అయ్యేటప్పటికి అతని వయస్సు 14 ఏళ్ళు. తండ్రికి ఇష్టం లేకపోయినా రాంప్రసాద్ ఆంగ్ల పాఠశాల‌లో చేరాడు. అయితే, అప్పటికే చిన్న చిన్న దురలవాట్లకు లోనయ్యాడు.

పూజారి సాంగత్యంలో సన్మార్గంలోకి…

రాంప్రసాద్‌ ఇంటికి సమీపంలో ఉన్న దేవాల‌యానికి కొత్త పూజారి వచ్చాడు. బాలుడైన రాంప్రసాద్ అంటే పూజారికి ఇష్టం ఏర్పడింది. అలా… పూజారి స్నేహంతో చెడు అల‌వాట్లకు స్వస్తిపలికాడు. పాఠశాల‌లో కూడా సుశీల‌చంద్రసేన్ అనే మంచి స్నేహితుడు ల‌భించాడు. రాంప్రసాద్ రోజూ కోవెల‌కు వెళ్ళడం, అక్కడ ప్రార్థన చేయడాన్ని మున్షీ ఇంద్రజిత్ అనే ఓ పెద్దమనిషి చూశాడు. ముచ్చటపడ్డాడు… చేరదీసి సంధ్యావందనం నేర్పాడు. ఆర్య సమాజ్ గురించి చెప్పాడు. స్వామి దయానంద సరస్వతి రాసిన సత్యార్ధప్రకాశమును రాంప్రసాద్ చదివాడు. ప్రభావితుడయ్యాడు. అయితే, ఇదంతా తండ్రికి ఇష్టం లేదు. మొత్తానికి ఆర్య సమాజ్… ధైర్యంగా బ్రతికేందుకు దారి చూపింది. బ్రహ్మచర్యవ్రత దీక్ష ప్రాముఖ్యాన్ని గ్రహించిన రాంప్రసాద్ మనసా, వాచా, కర్మణా ఆ వ్రతాన్ని ఆచరించాడు. అయితే, ఆర్య సమాజ్లోని యువకులు కార్యకలాపాల్లో దూసుకుపోతుండడంతో అందరికీ భయం కలిగింది. ఊరేగింపుల వ‌ల్ల‌ హిందూ, ముస్లిం మధ్య తగాదాలు సంభవిస్తాయేమోనని ఆందోళన చెందేవారు. ఆ సమాజ్లోని పెద్దల‌కు కూడా ఈ పిల్ల‌ల‌ పని నచ్చలేదు. అలా… ఆర్యకుమార సభ కనుమరుగైంది. ఆర్యసమాజ నాయకుడు స్వామి సోమదేవజీ ఆ సమయంలో అక్కడి వచ్చారు. స్వామి అనారోగ్యంగా ఉండడంతో రాంప్రసాద్ స్వామి సేవకై తన్నుతాను సమర్పించుకున్నాడు.

వికసించిన బుద్ధితో విప్లవ మార్గం వైపు…

రాంప్రసాద్ కు కొన్ని మంచి పుస్తకాల‌ పేర్లు చెప్పి స్వామిజీ చదవమన్నారు. అలా రాంప్రసాద్ బుద్ధి వికసించింది. 1916వ సంవత్సరంలో లాహోర్ కుట్రకేసులో భాయి పరమానందజీకి ఉరిశిక్ష పడింది. పరమానందజీ జనవాసిక్ హింద్అన్న పేరుతో ఓ పుస్తకం వ్రాశారు. ఆ గ్రంథం రాంప్రసాద్ చదవడంతో పరమానందజీ ఎడల‌ భక్తి పెరిగింది. 

పరమానందజీకి ఉరిశిక్ష పడడంతో రాంప్రసాద్ రక్తం మరిగిపోయింది. దెబ్బకు దెబ్బకు తీయాల‌ని నిశ్చయించుకున్నాడు. ఈ నిర్ణయాన్ని సోమదేవ స్వామికి చెప్పాడు.

ప్రతిజ్ఞ చేయడం తేలికే, ఆచరించటమే కష్టంఅన్నారాయన. సోమదేవస్వామి పాదాల‌ను తాకి ఈ పవిత్రపాదానుగ్రహం నాకుంది. నామాట నిబెట్టుకుంటానుఅని రాంప్రసాద్ అన్నాడు. విప్లవ మార్గానికి ఇదే నాంది అయింది.

పట్టువీడని విక్రమార్కుడు!

కొద్ది కాలానికి సోమదేవస్వామి పరమపదించారు. రాంప్రసాద్ తొమ్మిదో తరగతికి చేరుకున్నాడు. షాజహాన్పూర్ సేవా సమితిలో ఆయన చురుకైన పాత్ర పోషించాడు. అదే ఏడాది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వార్షిక సమావేశం ల‌క్నోలో జరగాల్సివున్నది. ఐక్యత లేని కాంగ్రెస్ మితవాదులు, అతివాదులుగా చీలిపోయింది. చర్చద్వారా, విజ్ఞప్తుల ద్వారా బ్రిటీష్ వారితో సంప్రదించి, స్వాతంత్య్రం తెచ్చుకోవాని మితవాదుల వాదన.

ఆంగ్లేయుల‌ను సంఘర్షణతో లొంగదీసి, సంపూర్ణ స్వాతంత్య్రాన్ని సాధించుకోవాలని అతివాదుల పట్టు! బాల గంగాధర్ తిలక్ ఆ సమావేశాల్లో పాల్గొనాల్సివుంది. మితవాదులు ఈ సమావేశాల‌కు ఎక్కువగా పాల్గొనడంతో తిల‌క్ కు స్వాగత ఏర్పాట్లు పెద్దగా చేయలేదు. కానీ, యువకుడైన రాంప్రసాద్ తిల‌క్‌ను భారీ ఊరేగింపుగా నగరంలో తీసుకువెళ్ళాల‌ని ఆకాంక్షించాడు. తిల‌క్ రైలు దిగగానే స్వాగత సమితి సభ్యులు నేరుగా కారులో కూర్చొబెట్టారు.

రాంప్రసాద్ తోపాటు మరో సభ్యుడు కారుకు అడ్డంగా వెళ్ళారు. ఈ కారు కదలాలంటే మా మీదుగా వెళ్ళనివ్వండిఅని భీష్మించారు. ఎంత సర్దిచెప్పినా వినలేదు. ఈలోపు రాంప్రసాద్ స్నేహితులు ఓ బండిని అద్దెకు తీసుకున్నారు. ఆ బండిలో తిల‌క్‌ను కూర్చోబెట్టి ఘనంగా ఊరేగింపుగా తీసుకువెళ్ళారు. అడుగడుగునా లోకమాన్య తిల‌క్‌పై పూల‌వర్షం కురిసింది. ఇక్కడే ధనం కోసం పుస్తకాలు అమ్మాడు.

మాతృమూర్తి సహాయంతో ప్రయాగకు మాయం..

బ్రిటీష్ పోలీసు వేట మొదలైంది. ఢిల్లీ నుంచి షాజహాన్పూర్ చేరుకున్నాక ఇది ఎక్కువైంది. విప్లవ సంఘంలోని ఇద్దరి సభ్యుల నడుమ పొడచూపిన బేధాభిప్రాయాలు పోలీసుల‌కు ఉప్పందించేందుకు కారణమయ్యాయి.

త్రుటిలో తప్పిన ప్రాణముప్పు!

ఈ సంగతి తెలుసుకుని, మెరుపు వేగంతో మరో ముగ్గురు మిత్రుల‌తో రాంప్రసాద్ షాజహాన్పూర్ నుంచి మాయమై ప్రయాగ చేరుకున్నాడు. ఒక రోజు సాయంత్రం యమునా నదిలో స్నానం చేసి, ఒడ్డున ధ్యానంలో నిమగ్నమయ్యాడు. స్నేహితులూ ఉన్నారు. ధాన్యంలో మునిగివున్న రాంప్రసాద్ తన చెవిపక్కనుంచి ఒక తుపాకీ గుండు దూసుకుపోయిన శబ్దానికి ఉలిక్కిపడ్డారు. సమీపంలో ఉంచుకున్న తన రివాల్వర్ను చేతికందుకునేంతలోనే మరోసారి తుపాకీ శబ్దం వినిపించింది.

రాంప్రసాద్ అప్రమత్తమయ్యేలోపే స్నేహితులు పారిపోయారు. తనపై హత్యాప్రయత్నం జరిగిందని గుర్తించిన ప్రసాద్… లాభం లేదకుని యోధులైన మద్దతుదారుల‌ను కూడగట్టుకోవాల‌ని అక్కడే నిర్ణయించుకున్నాడు. ఆ మరుసటిరోజు ల‌క్నో చేరుకున్నాడు. జరిగిన ఘటనను స్నేహితుల‌కు చెప్పాడు. తల్లినీ కలిశాడు. కొద్ది రోజులు గ్వాలియర్లోని బంధువుల ఇంటికి వెళ్ళిపొమ్మని తల్లి సహా ఇచ్చింది.

గ్వాలియర్లో ఏరువాక

గ్వాలియర్లో రాంప్రసాద్ వ్యవసాయం చేశాడు. తన మనసులోని విప్లవభావాలు సాహిత్యరూపంగా మలిచాడు. ఏరువాకతోపాటు సాహిత్య పంటా పండించాడు. బెంగాలీ పుస్తకాల‌ను హిందీలోకి అనుదించాడు. మరికొన్ని స్వీయరచనలు చేశాడు.

పశువుల‌ను మేతకు వదిలి, తాను ఓ చెట్టు నీడకు చేరి, రచనలు చేసేవాడు రాంప్రసాద్. బోల్షివిక్ విప్లవం’, ‘కాథరిన్’, ‘స్వదేశీ రంగువంటి రచనలు అప్పుడు వెలివడ్డవే… యోగసాధన అన్నపేరుతో అరవిందు పుస్తకాన్ని అనువదించాడు. గణేశ్ శంకర్ విద్యార్థి “సుశీల్ మాలాప్రభ” అనే పత్రిక నడుపుతుండేవాడు. అందులో రాంప్రసాద్ రచనలు ప్రచురితమయ్యేవి.

కుటుంబం కోసం ఆహోరాత్రులు శ్రమించి…

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత విప్లవకారుల‌ విషయంలో ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవడంతో రాంప్రసాద్ తిరిగి షాజహాన్పూర్ కు తిరిగొచ్చాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయం. వయసొచ్చిన చెల్లికి ఇంకా పెళ్ళి కాలేదు. కాబట్టి తానే కుటుంబానికి జీవనాధరం కావాల‌ని నిశ్చయించుకున్నాడు. ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించాడు. కానీ, ఆశించిన సంపాదన లేదు. దాన్ని మూసివేశాడు. కొందరు మిత్రుల‌ సహాయంతో ఓ సంస్థలో మేనేజర్ గా కుదిరాడు. కొద్ది కొద్దిగా కుటుంబ పరిస్థితి మెరుగైంది. మళ్లీ విప్లవం వైపు మనస్సు మళ్ళింది. కానీ, ఆ సమయంలో సహాయనిరాకరణోద్యమానికి ప్రజల మద్దతు ఉంది. కాబట్టి ఇది సరైన సమయం కాదనుకున్నాడు. క్రమంగా విప్లవ కార్యాలు స్తంభించిపోయాయి. తర్వాత పట్టు పరిశ్రమ స్థాపించాడు. అహోరాత్రాలూ శ్రమించాడు. ఒక ఏడాదిలో పరిశ్రమ నిలదొక్కుకుంది. చెల్లిని ఒక జమిందారుకిచ్చి పెళ్ళిచేశాడు. తల్లి ఆనందించింది. 

మళ్ళీ విప్లవం వైపు…

గాంధీజీ సహాయనిరాకరణోద్యం 1921లో ముగియడంతో మళ్ళీ విప్లవోద్యమం పుంజుకుంది. హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్పేరుతో ఒక సంస్థ అఖిల భారత స్థాయిలో ప్రారంభించబడింది. క్రమంగా విప్లవకారుల చేతులు కలిశాయి. రాంప్రసాద్ కు పిలుపు వచ్చింది. స్నేహితుడికి పట్టు పరిశ్రమను అప్పజెప్పి, విప్లవ జెండా పట్టాడు. ప్రజల మద్దతూ గట్టిగా ఉంది. అయితే, మళ్ళీ నిధుల సమస్య ఉత్పన్నమైంది. యువ కిశోరాలు నిరాశలో ఉన్నారు. ధన లేమిపై తీవ్రంగా ఆలోచించిన రాంప్రసాద్… ప్రణాళిక రచించాడు. మొదట్లో ఒకటి, రెండు గ్రామాలు దోచుకున్నారు. అయినా, ధన సేకరణ రెండు వందల రూపాయల‌ కంటే ఎక్కువ ల‌భ్యం కావడం లేదు. పైగా దోచుకున్న గ్రామాలు ఎవరివి? మన వాళ్ళవేనన్న అభిప్రాయం ఏర్పడింది. ఇది అన్యాయం! ఇలా చేయడం నేరం!! వద్దని మూకుమ్మడిగా నిర్ణయించుకున్నారు.

కాకోరీ వద్ద రైలు దోపిడీ!

ఒక రోజు ఇలా ఆలోచిస్తూ షాజహాన్పూర్ నుంచి లక్నో వైపు వెళ్తున్న రైలులోప్రయాణం చేస్తున్న రాంప్రసాద్… ప్రతి స్టేషన్లో రైలు ఆగటం, స్టేషన్ మాస్టర్ ధనపు సంచుల‌ను తెచ్చి, గార్డుక్యారేజీలో పడేయటం గమనించాడు. భద్రత కూడా అంతంతమాత్రమే. ఈ ధనాన్నే దోచుకుంటే సరి! రైట్… ఇదే గొప్ప ఆలోచనఅనుకున్నాడు. తన స్నేహితుల‌కు చెప్పాడు.

లక్నోకు దగ్గరలోని చిన్న పల్లెటూరు… కాకోరి! ఆగస్టు 9, 1925వ సంవత్సరం. కాకోరి గ్రామం చేరుకుంటున్న రైలును రాంప్రసాద్ అండ్ కో గొలుసులాగి నిలిపివేశారు. ఇంకేముంది… గార్డు పెట్టెలోని ప్రభుత్వ ధనాన్ని ఒక్క ఉదుటున దోపిడీ చేశారు. పోలీసు కాల్పుల‌ నుంచి తప్పించుకున్నారు. అత్యంత చాకచక్యంగా జరిగిన ఈ దోపిడీ ఆంగ్ల ప్రభుత్వాన్ని కుదిపివేసింది. ప్రాథమిక విచారణ అనంతరం ఒక నెల‌ తర్వాత అందరి మీద అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. చంద్రశేఖర్ ఆజాద్ మినహా అందరూ దొరికిపోయారు. ఆరు నెల‌ల‌ పాటు విచారణ తర్వాత రాంప్రసాద్, అష్పాకుల్లా, రోషన్ సింగ్, రాజేంద్రలాహిరికు ఉరిశిక్ష విధించారు. ఈ విషాద వార్త దేశవ్యాప్తంగా దావనంలా వ్యాపించింది. దేశమంతటా అగ్గిమీద గుగ్గిల‌మైంది. కానీ, ఏమి చేయలేని నిస్సహాయ స్థితి! ఉరిశిక్ష రద్దు చేయండని ఆంగ్లేయ‌ల‌ ప్రభుత్వానికి ప్రముఖులు లేఖలు రాశారు. కానీ, ఫలితం లేకపోయింది. 1927 డిసెంబర్, 18… రాజేంద్రలాహిరిని ఉరితీశారు. 19వ తేదీన రాంప్రసాద్, అష్పాకుల్లాను, 20న రోషిన్ సింగ్ను ఉరితీశారు. భరతమాతను బానిస సంకెళ్ళనుంచి విముక్తి కల్పించేందుకు చేపట్టిన పోరాటంలో అమరుల‌య్యారు. భారత దేశ స్వాతంత్య్రోద్యమ చరిత్రలో  ఒక సువర్ణ అధ్యాయం లిఖించారు.

 నాకు జన్మనిచ్చిన ప్రియమైన తల్లీ! నన్ను ఆశీర్వదించు. చివరి క్షణం వరకు నా హృదయం చలించకుండా నన్నాశీర్వదించు. నీ పవిత్ర పాదాల‌ వద్ద నా జీవన కుసుమాన్ని ఉంచేలా ఆశీర్వదించుఅని రాంప్రసాద్ ఉరిశిక్షకు ముందు తన తల్లిని వేడుకుంటూ ఆత్మకథలో రాసుకున్నాడు.

రాంప్రసాద్ కలం పేరు బిస్మిల్…

హిందీలో బిస్మిల్‌కు గొప్ప విప్లవ రచయితగా పేరుంది. ఆ పేరునే రాంప్రసాద్ తన రచన దిగువ క‌లం పేరుగా రాసుకునే వాడు.

లెక్కకు అందని ఘనమైన చరిత్ర సొంతం చేసుకున్న భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రోజు రోజుకూ పుట్టుకొస్తున్న దుష్టశక్తుల భరతం పట్టినప్పుడే…  యోధుడిలా జీవించి యోధుడిలానే మృత్యుఒడికి చేరిన రాంప్రసాద్ బిస్మిల్ మనం అర్పించే నిజమైన నివాళి.

విప్లవ వీరుడు రాంప్రసాద్ బిస్మిల్ జయంతి నేడు.

సంకలనం – గున్న కృష్ణమూర్తి, 630 45 99 218

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.