రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ “కార్యకర్త వికాసవర్గ-2” కార్యక్రమం నాగ్‌పూర్‍లోని డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిర ప్రాంగణంలోని మహర్షి వ్యాస్ సభామందిరంలో మే 17వ తేదీన ప్రారంభమైంది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో వర్గ సర్వాధికారి ఇక్బాల్ సింగ్ జీ, సహ సర్‌కార్యవాహ డాక్టర్ కృష్ణ గోపాల్‌జీ, అఖిల భారతీయ సేవా ప్రముఖ్ – వర్గ పాలక అధికారి పరాగ్‌జీ అభ్యంకర్ భారతమాత విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సహ సర్‌కార్యవాహలు ముకుంద్ జీ, రామ్ దత్ చక్రధర్ జీ పాల్గొన్నారు. వర్గలో దేశం నలుమూలల నుంచి విచ్చేసిన 936 మంది శిక్షార్ధులు భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా పరాగ్‌జీ అభ్యంకర్ స్వయంసేవకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ… నాగ్‌పూర్‌లో సంఘ కార్యం గురించి తెలుసుకోవడం, దానిని ఆచరించడం ఒక సౌభాగ్యం అనే భావన స్వయంసేవకులలో ఉంటుందన్నారు. సంఘ కార్యమే జీవన కార్యమనే భావన కూడా స్వయంసేవకుల మనస్సులో చోటు చేసుకుంటుందన్నారు. ఈ భూమి డాక్టర్ హెడ్గేవార్, శ్రీ గురూజీల తపోస్థలమని ప్రస్తుతించారు.
సంఘటిత హిందూ సమాజంలో విశ్వవ్యాప్త దృష్టికోణాన్ని పెంపొందించే రీతిలో ఈ వర్గ రూపకల్పన జరిగింది.
దేశవ్యాప్తంగా ఈ ప్రశిక్షణ కోసం వచ్చే శిక్షార్ధులైన స్వయంసేవకులలో జాతీయ ఏకాత్మతా భావం విస్తరిస్తుంది. హిందుత్వ ఏకతా అనుభూతి కూడా అనుభవంలోకి వస్తుంది. ఈ వర్గ సమాపనోత్సవం జూన్ 10వ తేదీన జరుగుతుంది.