News

ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవం

88views

వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్స వాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి (బ్రహ్మం గారు) క్రీ.శ.1693 శ్రీముఖ నామ వైశాఖ శుద్ధ దశమి రోజు సజీవ సమాధి నిష్ట వహించారు. అప్పటి నుంచి ఏటా ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 331వ ఆరాధన మహోత్సవాన్ని పలు రాష్ట్రాల్లో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాల్లో నిర్వహించారు. బ్రహ్మంగారి మఠంలో కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామికి ఉదయం విశేష పూజలు చేసి, ప్రత్యేకంగా అలంకరించారు. మధ్యాహ్నం దీక్షబంధనాలంకారోత్సవంలో భక్తులకు దర్శ నమిచ్చారు.

స్వామి సజీవ సమాధిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామి మాల ధారులు ఇరుముడి సమర్పించేందుకు అధిక సంఖ్యలో వచ్చారు. స్వామి నడయాడిన నంద్యాల జిల్లా బనగానపల్లెలోని నేలమఠం, చింతమానుమఠం, రవ్వలకొండ, యాగంటిలో తపస్సు చేసిన గుహ, కర్ణాటక రాష్ట్రం చిక్ బల్లాపూర్ల్ జిల్లాలోని కళహరహళ్లిలో ఉన్న పాపాగ్నిమఠంలో ఆరాధనోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.