News

అవును చైనా ఆక్రమించింది: లడ్డాఖ్ ఎంపీ

1.3kviews

త కొద్ది రోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తలు చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలకు చెందిన సైనిక ఉన్నతాధికారులు పలు దఫాలుగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో లడ్డాఖ్‌లోని భారత్‌ భూభాగాన్ని చైనా ఆక్రమించిందా అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌ గాంధీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నించారు. రాహుల్ ట్వీట్‌పై లడ్డాఖ్ ఎంపీ జమ్యాంగ్ సెరింగ్ నంగ్యాల్ స్పందించారు. కాంగ్రెస్‌ హయాంలోనే చైనా భారత్ భూభాగాన్ని ఆక్రమించుకుందని, ఇందుకు తగిన ఆధారాలు అంటూ పలు సందర్భాల్లో చైనా ఆక్రమించిన ప్రదేశాలను సూచిస్తూ ఫొటో, దానికి సంబంధించిన వివరాలను షేర్‌ చేశారు.

”రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీలు నేను ట్వీట్‌లో పేర్కొన్న ఆధారాలతో ఏకీభవిస్తారని భావిస్తున్నాను. ఇక మీదట వారు అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించరని అనుకుంటున్నా” అని జమ్యాంగ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందులో ఆయన రాహుల్ గాంధీ ప్రశ్నకు బదులిస్తూ ”అవును చైనా భారత్‌ను ఆక్రమించింది. 1962లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 37 వేల చదరపు కిలోమీటర్ల ఆక్సాయి చిన్‌ భూభాగాన్ని, 2008 యూపీఏ పాలనలో చుమూర్‌లోని టియా పాంగ్‌నాక్‌, ఛాబ్జి వ్యాలీ ప్రాంతాలను ఆక్రమించింది. డెంచోక్‌లోని జోరావర్‌ ఫోర్ట్‌ను 2008లో పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) నాశనం చేసింది. ఆ ప్రాంతంలో పీఎల్‌ఏ 2012లో పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, కొత్తగా చైనీస్‌ డెంచోక్‌ కాలనీ పేరుతో 13 సిమెంట్ ఇళ్లు నిర్మించింది. ఈ రెండు ఘటనలు కూడా యూపీఏ హయాంలోనే జరిగాయి. 2008-2009 యూపీఏ పాలనలో భారత్ దుంగ్తి, డెంచోక్‌ మధ్య ఉన్న పురాతన వ్యాపార కేంద్రం డూమ్ చిలీని కూడా కోల్పోయింది” అని అందుకు సంబంధించిన ప్రదేశాలను సూచిస్తూ ఫొటోలను కూడా జోడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.