News

అత్యవసర వస్తువుల చట్ట సవరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

829views

రైతులు ఇకపై తమ పంటలను దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునేందుకు వీలుగా కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు అత్యవసర వస్తువుల చట్ట సవరణకూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తృణ ధాన్యాలు, ఉల్లిపాయలు సహా వివిధ ఆహార పదార్థాలపై ఉన్న నియంత్రణను ఎత్తివేసేందుకు ఉద్దేశించిన ఈ చట్టాన్ని సవరించనుంది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయం సహా, పలు ఇతర అంశాలకు సంబంధించిన తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రులు ప్రకాశ్‌ జావడేకర్‌, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ విలేకరులకు వెల్లడించారు.

రైతులు తమ పంట ఉత్పత్తులను ఏ రాష్ట్రంలోనైనా విక్రయించుకునేందుకు వీలుగా వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం, వాణిజ్యం ఆర్డినెన్స్‌, 2020కి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ఆర్డినెన్స్‌ కింద రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ నోటిఫై చేసిన మార్కెట్లే కాక రాష్ట్రంలోని గానీ, రాష్ట్రం వెలుపల గానీ పంట ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం చేసుకునేందుకు వీలు కల్పిస్తుందని కేంద్రమంత్రి తోమర్‌ తెలిపారు. వ్యవసాయదారులే నేరుగా అగ్రిగేటర్లు, పెద్ద రిటైలర్లు, ఎగుమతిదారులతో నేరుగా రైతులు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలుగా మరో ఆర్డినెన్స్‌ను కూడా తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇవి రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో పేర్కొన్న అంశాలకు కొనసాగింపుగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

వీటితో పాటు కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్‌ పేరును ఇకపై శ్యామప్రసాద్‌ ముఖర్జీ పోర్ట్‌ ట్రస్ట్‌గా వ్యవహరించనున్నారు. అలాగే ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద ఫార్మాకపియా కమిషన్ ఫర్ ఇండియన్ మెడిసిన్ అండ్‌ హోమియోపతి (పీసీఐఎంహెచ్‌)ను సబార్డినేట్ కార్యాలయంగా ఏర్పాటు చేయడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పెట్టుబడులను ఆకర్షించడానికి మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ (ఈజీఓఎస్‌), ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ సెల్స్‌ (పీడీసీ) బృందాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.