
పార్టీ నాయకత్వ లోపంతో మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మార్చిలో గుజరాత్ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన ఘటన మరువక ముందే, తాజాగా ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. జూన్ 19న గుజరాత్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల రాజీనామా ఆ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అక్షయ్ పటేల్, జితు చౌధురీ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించగా, వాటిని ఆమోదించినట్లు గుజరాత్ శాసనసభ స్పీకర్ రాజేంద్ర త్రివేది ప్రకటించారు.
అక్షయ్ పటేల్ వడోదర నుంచి గెలుపొందగా, జితు చౌధురీ కాప్రాడా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తమ ఎమ్మెల్యేల రాజీనామాలకు కారణం అధికార భాజపా కారణమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ వ్యాఖ్యలను భాజపా తిప్పికొట్టింది. కాంగ్రెస్ పార్టీతో వారు అసంతృప్తి చెంది రాజీనామా చేశారని భాజపా విమర్శించింది. ఈ ఏడాది మార్చి నెలలో రాజసభ్య ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అనంతరం ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. తాజాగా ఇద్దరి రాజీనామాతో రాజ్యసభ ఎన్నికల్లో రెండు సీట్లు గెలవాలన్న కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
గుజరాత్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్ధులను బరిలో దింపగా, భాజపా ముగ్గురిని బరిలో ఉంచింది. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు భాజపా తరపున 103 మంది, కాంగ్రెస్ తరపున 68 మంది గెలిచారు. భారతీయ ట్రైబల్ పార్టీ రెండు, ఎన్‌సీపీ, స్వతంత్రులు ఒక్కో స్థానంలో గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో అసెంబ్లీలో ఆ పార్టీ బలం 61కి చేరింది.





