
కరోనా మహమ్మారికి కేంద్ర బిందువైన చైనాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజే 33పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని అక్కడి అధికారులు వెల్లడించారు. వీటిలో 31కేసులు లక్షణాలు లేకుండానే గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే దేశంలో కొవిడ్-19 మహమ్మారి రెండవ దఫా విజృంభించే అవకాశం ఉందని నిపుణుల సూచనలతో దాదాపు కోటి మంది జనాభాగల వుహాన్‌లో భారీగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. దీనిలో భాగంగానే తాజాగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. వీటిలో ఎక్కువగా లక్షణాలు కనిపించడం లేదు. వుహాన్ కాకుండా గాంగ్‌డాంగ్, షాంఘై ప్రావిన్సుల్లో కూడా తాజాగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది. అయితే వీటిలో కొన్ని బయట ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తుల వల్లే సోకినట్లు తేలగా.. మరికొన్ని మాత్రం స్థానికంగానే వ్యాపించినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తంమీద బయటకు లక్షణాలు కనిపించని కేసులే ఎక్కువగా బయటపడుతున్నాయని వెల్లడించారు. అత్యధికంగా వుహాన్‌లో లక్షణాలు లేకుండానే వైరస్ వ్యాప్తి చెందుతుందని ఎన్‌హెచ్‌సీ పేర్కొంది.





