ArticlesNews

బ్రిటన్ మనకు మిత్ర దేశమేనా?

305views

“విభజించు పాలించు” అన్న సూత్రాన్ని అనుసరించి రెండు వందల ఏళ్లు భారతీయులను బానిసలుగా చేసుకొని పాలించిన ఇంగ్లాండు ఇప్పుడు కూడా భారతదేశంపై కుట్రపూరిత విధానాలనే అనుసరిస్తున్నట్లుగా తోస్తోంది.

పైకి భారత్ తన మిత్ర దేశం అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండే బ్రిటన్ ప్రభుత్వం రహస్యంగా భారత్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లుగా అనిపిస్తోంది. ఆంగ్లేయ ప్రభుత్వ కనుసన్నలలో నడిచే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పోరేషన్ (BBC) లో వస్తున్న భారత వ్యతిరేక కథనాలే అందుకు సాక్ష్యం.

కరోనా వైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా భారత ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘ఆరోగ్య సేతు’ యాప్ కారణంగా పౌరుల వ్యక్తిగత సమాచారం యొక్క గోప్యత ప్రశ్నార్థకం అవుతుంది అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ బి బి సి ఒక కథనాన్ని వెలువరించింది. నిజానికి బ్రిటన్ కూడా తమ పౌరులలో కరోనా రోగులను గుర్తించటానికి పూర్తిగా ఆరోగ్య సేతును పోలిన యాప్ ను బ్రిటన్ కు చెందిన ఆరోగ్య సంస్థ NHS (NATIONAL HEALTH SERVICE) విడుదల చేసింది. బ్రిటన్ ఆ యాప్ పైనే ఆధారపడుతోంది. మరి ఆ దేశ ప్రజలకు  ఆ యాప్ విషయంలో ఇబ్బందులు లేవా? ఉంటే బి బి సి కి ఎందుకు కనబడవు? భారత్ లోని కొందరు నిత్య ఆందోళనాపరులతో ప్రపంచ ప్రఖ్యాత వార్తా సంస్థ గొంతు కలపడంలోని ఔచిత్యం ఏమిటి?

ఆ మధ్య జరిగిన CAA అల్లర్లలో ప్రధాన పాత్ర పోషించిన సఫ్కరా జార్గర్ అనే ఒక విద్యార్థిని అరెస్టుపై కూడా బి బి సి ఒక అనవసర కథనాన్ని వెలువరించింది. గర్భిణి అయిన ఆ విద్యార్థిని జైలు గోడల మధ్య నరక యాతన అనుభవిస్తోంది అంటూ ఆందోళన వెలిబుచ్చింది.

బ్రిటన్, యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలన్న ప్రతిపాదన  వచ్చినప్పుడు ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన తమ ప్రజల విషయంలో ఆంగ్లేయ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించిందో, ఆ విషయాలు ప్రపంచానికి తెలియకుండా ప్రసార మాధ్యమాలను ఎలా మేనేజ్ చేసిందో ప్రపంచానికి వెల్లడించే ప్రయత్నం BBC ఎందుకు చెయ్యదు?

2010లో అక్కడి విద్యార్థులకు ఫీజులు పెంచిన కారణంగా జరిగిన విద్యార్థి ఉద్యమాన్ని బ్రిటన్ పోలీసులు అత్యంత కఠినంగా, క్రూరంగా అణచివేసిన వైనాన్ని BBC ప్రపంచానికి ఎందుకు విశ్లేషించి చెప్పదు?

చైనాలోని విదేశీ పెట్టుబడులు భారత్ కు తరలి రానున్నాయన్న విషయంలోనూ బి బి సి తన అక్కసును వెళ్ళబోసింది. భారత్ లో చైనా వంటి పరిస్థితులు లేవంటూ ఏవేవో కాకమ్మ కథలతో కథనాలు ప్రచురించింది. నిజానికి ఏ విధంగా చూసుకున్నా కమ్యూనిస్టు చైనా కంటే లౌకిక భారతం విదేశీ పెట్టుబడులకు అన్ని రకాల అనుకూలతలు కలిగివున్న దేశం అనటం నిర్వివాదాంశం.

భారత ప్రధాని బ్రిటన్లో పర్యటించినప్పుడు బ్రిటన్ జాతీయులైన ముస్లిములు, ఖలిస్తాన్ ఉద్యమ మద్దతుదారులు కొందరు భారత ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు. భారత ప్రధాని బ్రిటన్ పర్యటన సందర్భంగా భారత్, బ్రిటన్ ప్రధానుల మధ్య జరిగిన చర్చలు, ఒప్పందాల వివరాల కంటే మిన్నగా భారత ప్రధానికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలకే BBC అధిక ప్రాధాన్యమిచ్చింది. BBC యొక్క భారత వ్యతిరేక వైఖరిని ఈ ఉదంతం తేటతెల్లం చేస్తుంది.

ఈ విషయాలే కాదు బి బి సి ఇలా అనేక విషయాలలో తన భారత వ్యతిరేక వైఖరిని చెప్పకనే చెబుతూ వుంటుంది. పైగా భారత ప్రభుత్వానికి, దేశానికి, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే భారత్ లోని కొన్ని వర్గాల, రాజకీయ పక్షాల ధోరణికి తగ్గ వాదనను బి బి సి తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో బి బి సి నిరాధార, తప్పుడు కథనాలను కూడా ప్రసారం చేసిన సందర్భాలు అనేకం.

అయితే బి బి సి బ్రిటన్ ప్రభుత్వ కనుసన్నలలో నడిచే వార్తా సంస్థ కావడం వల్ల బి బి సి అనుసరిస్తున్న భారత వ్యతిరేక వైఖరికి బ్రిటన్ ప్రభుత్వ మద్దతు కూడా ఉన్నదని భావించాల్సి వస్తుంది.

పైకి దౌత్య పరంగా భారత్ తో స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నట్లుగా కనిపించే బ్రిటన్ ప్రభుత్వం తన చెప్పుచేతలలోని వార్తా సంస్థల ద్వారా భారత దేశ ప్రయోజనాలకి భిన్నమైన కథనాలను ప్రచారం చేయడం ద్వారా భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలనే రహస్య వ్యూహాన్ని అమలు చేస్తున్నదేమో అన్న సందేహం ఏమాత్రం ఊహాజనితమైనది కాదు.

ఇంకో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే భారత్ లో వివిధ నేరాలతో సంబంధాలు కలిగిన వ్యక్తులు అనేకులు ప్రస్తుతం బ్రిటన్లోనే తల దాచుకుంటూ ఉండడం. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి ఆర్థిక నేరస్తులే కాకుండా వివిధ ఉగ్రవాద కార్యకలాపాలలో, బాంబు దాడులలో నిందితులుగా ఉన్న వాళ్ళు ప్రస్తుతం ఇంగ్లాండ్ లోనే తల దాచుకుంటూ ఉన్నారు. బ్రిటన్ ప్రభుత్వం వివిధ సాంకేతిక కారణాలు చూపుతూ వారిని భారత్ కు అప్పజెప్పకుండా కాలయాపన చేస్తూ ఉండడం ఒక ఎత్తయితే వారందరికీ అక్కడ తగినంత రాజకీయ అండదండలు కూడా లభిస్తూ ఉండడం మరో విశేషం. 1993లో సూరత్ లో జరిగిన రెండు వరుస బాంబు దాడులలో ప్రధాన నిందితుడైన, భారత్ కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన దావూద్ ఇబ్రహీం అనుచరుడు టైగర్ హనీఫ్ ను భారత్ కు అప్పగించకుండా ఒక బ్రిటిష్ హోం సెక్రటరీ (హోం మినిస్టర్) అడ్డుకున్నారు. ఈ సంఘటన 2019 లో జరిగింది.

రాజేష్ కపూర్, సీమా కపూర్, పళని అప్పన్ రాజరత్నం, పాల్ శామ్యూల్ ఇలా భారత్ లో వివిధ నేరాలలో నిందితులై ఉండి ఇంగ్లాండులో తలదాచుకుంటూ ఇంగ్లాండు చట్టాల, ప్రభుత్వాల పుణ్యమా అని తప్పించుకు తిరుగుతున్న నేరస్తుల చిట్టా కాసింత పెద్దదే. బ్రిటిష్ ప్రభుత్వం భారత్ కు అప్పగించడానికి నిరాకరించిన భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ తొమ్మిది మంది ఉండగా, ఇంగ్లాండ్ కోర్టులు అరెస్ట్ వారెంట్ ఇవ్వడానికి నిరాకరించిన నిందితులు ముగ్గురు. అలాగే ఇప్పటివరకూ భారత ప్రభుత్వం తమకు అప్పగించాలంటూ చేసుకున్న 15  విన్నపాలు యూకే ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. భారత్ లోని జైళ్లలో ఉండే కఠినమైన పరిస్థితుల కారణంగా సదరు నిందితులు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది కనుక వారిని భారత్ కు అప్ప చెప్పలేమన్నది బ్రిటన్ ప్రభుత్వము, కోర్టులు చెప్పే ఒక కారణం. ఇది బహు విచిత్రమైనది, ఆశ్చర్యకరమైనది.

అదే నిజమైతే  ఆంగ్లేయుల పాలనా కాలంలో భారతీయ జైళ్లలో మగ్గిన మన దేశభక్తుల మాటేమిటి? వారికి అప్పట్లో ఆంగ్లేయ ప్రభుత్వం ఏమైనా ఫైవ్ స్టార్ వసతులు కల్పించిందా? అండమాన్లోని కాలాపానీ జైలులో భారతీయ స్వాతంత్ర ఉద్యమకారులకు జరిగిన అవమానాలు, అక్కడ వారు అనుభవించిన నరక యాతన భారత జాతి ఇంకా మరువనేలేదు.

అంతేకాదు జలియన్ వాలాబాగ్ దురంతం మాటేమిటి? జలియన్ వాలాబాగ్ లో ఆంగ్లేయ ప్రభుత్వం జరిపించిన కాల్పులలో వందలాది మంది అమాయక భారతీయులు మరణించి వందేళ్లు గడిచిన తర్వాత కూడా ఆ దుర్మార్గానికి క్షమాపణలు చెప్పే సంస్కారం బ్రిటిష్ ప్రభుత్వానికి లేదు.

రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్ తరపున పోరాడి తమ ప్రాణాలను అర్పించిన వేలాది భారతీయ సైనికుల పట్ల కించిత్ కృతజ్ఞత గానీ, వారి మరణాల పట్ల సానుభూతి గానీ, పశ్చాత్తాపంగానీ బ్రిటిష్ పాలకులలో ఎప్పుడూ లేదు. వీరా మనకు మానవతావాద పాఠాలు నేర్పేది? ఇది బ్రిటిష్ పాలకుల ద్వంద్వ నీతికి, కుహనా మానవతా వాదానికి తార్కాణం.

భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్న 1918 – 1920 మధ్యకాలంలో స్పానిష్ ఫ్లూ అనే అంటు వ్యాధి కారణంగా మనదేశంలో సుమారు ఒకటిన్నర కోట్లమంది ప్రజలు మృత్యువాత పడ్డారు. అప్పుడు ఆ స్పానిష్ ఫ్లూ బారి నుంచి భారత ప్రజలను రక్షించడానికి అప్పటి ఆంగ్లేయ ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. ఆంగ్లేయ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగానే దేశంలో మృత్యువు కరాళ నృత్యం చేసింది.

అలాగే 1943లో బెంగాల్ లో ఆకలి చావుల కారణంగా దాదాపు 3 కోట్ల మంది ప్రజలు మృత్యువాత పడడానికి కారణం కూడా అప్పటి ఆంగ్లేయ పాలకుల నిర్లక్ష్యం, భారతీయుల పట్ల జాలి, కరుణ, దయ లేకపోవడం, భారతీయులంటే చిన్న చూపు ఉండడం, భారత దేశం పట్ల, ప్రజల పట్ల బాధ్యత లేకపోవడం.

అదే స్వాతంత్ర్యానంతరం  భారత ప్రభుత్వాలు ఎన్నడూ ప్రజల ప్రాణాల పట్ల అంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన దాఖలాలు లేవు.

ప్రస్తుత కరోనా సంక్షోభాన్నే తీసుకుందాం. ప్రపంచంలోని ఎన్నో అగ్రగామి దేశాలకంటే మిన్నగా భారత ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకుంది. ఆ క్రమంలో ఆర్థికంగా, రాజకీయంగా ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ప్రజారోగ్యం ముందు అవేవీ తనకు లెక్కలోనివి కావని తన చర్యల ద్వారా భారత ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇంత విషమ పరిస్థితుల్లోనూ, లాక్ డౌన్ కారణంగా సుదీర్ఘకాలంపాటు ప్రజా జీవనం స్తంభించి పోయినప్పటికీ భారత్ లో ఒక్క ఆకలి చావు కూడా కనిపించలేదు.  తమ ప్రజల సంక్షేమంపై స్వదేశీ పాలకులకు ఉన్న శ్రద్ధ, నిబద్ధతలు పరదేశీ పాలకులకు ఎందుకుంటాయి?

బ్రిటిష్ ప్రభుత్వం యొక్క వైఖరిని బట్టి చూస్తే బ్రిటన్ ఏమాత్రం నమ్మదగిన దేశం కాదు అని మనకు స్పష్టం అవుతోంది. పైకి మనతో మిత్రత్వం నటిస్తూనే భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, భారత ప్రజల సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీయడానికి ఇంగ్లాండ్ ఒక పథకం ప్రకారం అడుగులు వేస్తోంది.  “విభజించు పాలించు” అన్న ఆంగ్లేయుల కపట నీతిలో అప్పటికీ, ఇప్పటికీ ఎలాంటి తేడా లేదు. తన వార్తా సంస్థలలో భారత వ్యతిరేక కథనాలను వెలువరించడం ద్వారా భారతీయులను విభజించడానికి, మన దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మనల్ని ప్రేరేపించడానికి, అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను మసకబార్చడానికి బ్రిటిష్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తూ ఉన్నది. కనుక బ్రిటన్ తో వ్యవహరించే విషయంలో ప్రభుత్వాలు మెళకువగా వ్యవహరించాల్సి ఉంది. అంతేకాదు మనం కూడా అదేదో ఇరు ప్రభుత్వాల వ్యవహారంగా భావించి మిన్నకుండి పోకుండా సహేతుక దృష్టితో ఆలోచించి మేకవన్నె పులుల వంటి పాశ్చాత్య దేశాల కుట్రలను అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు వారి వ్యూహాలను చిత్తు చేయడం ద్వారా భారతీయులు విజ్ఞులని ప్రపంచానికి చాటుదాం. భారత్ మాతాకీ జయ్.

– శ్రీరాంసాగర్.

REFERENCES :

https://www.ndtv.com/india-news/india-s-extradition-request-for-dawood-aide-tiger-hanif-refused-by-uk-2230493?pfrom=home-topscroll

https://www.bbc.com/news/world-asia-india-52672510

https://www.bbc.com/news/world-asia-india-52659520

https://www.bbc.com/news/world-asia-india-52608589

https://en.m.wikipedia.org/wiki/2010_United_Kingdom_student_protests

https://www.bbc.com/news/uk-34798363

https://www.theguardian.com/politics/2015/nov/12/indian-pm-confronted-by-angry-protesters-in-downing-street

https://www.bbc.com/news/world-asia-india-34513311

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.