ArticlesNews

సంక్షోభాన్ని సమైక్యంగా ఎదుర్కొందాం

851views

క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడే ఒక మనిషి అసలు వ్యక్తిత్వం బయట పడుతుందంటారు. కోవిడ్19 కన్నా క్లిష్టమైన పరిస్థితి మరొకటి ఏముంటుంది? ఈ సమయంలో ప్రస్తుతం భారతదేశాన్ని నడుపుతున్న నాయకత్వం ప్రదర్శిస్తున్న ధైర్యం, ఆత్మస్థైర్యం ప్రపంచ దేశాల మెప్పు పొందుతున్నది.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సరైన మందులే లేని వేళ దానిని నిరోధించేందుకున్న ఏకైక మార్గం సామాజిక దూరం పాటించడం. అందుకోసం దేశం మొత్తాన్ని ‘లాక్ డౌన్’ లో ఉంచే ఒక సాహసోపేత నిర్ణయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నారు. లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతింటుందని ప్రభుత్వానికి తెలుసు. నాలుగు వారాల పైచిలుకు లాక్ డౌన్ కి దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని కూడా తెలుసు. అయినా భారత ప్రభుత్వం ‘లాక్ డౌన్’ ప్రకటించే సాహసం చేసింది.

‘బ్రతికుంటే బలుసాకు తినవచ్చు’ అన్నది మన సామెత. మనుషుల ప్రాణాల కన్నా ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం కానే కాదు. ఆరోగ్యంతో బ్రతికి బయటపడితే కష్టించి పనిచేసి నష్టపోయిన దానిని తిరిగి సంపాదించుకోగలం. ఆప్తులను కరోనా బలిగొంటే తిరిగి పని చేయటమనే మానసిక స్థితి ప్రజలకు రాదు. అందుకే ఆపత్కాలంలో ప్రాణాలు కాపాడటానికే ప్రాధాన్యత. ఇది మన పెద్దలు చెప్పిన మాట. నేటి మన దేశ నాయకత్వం అనుసరిస్తున్న బాట.

లాక్ డౌన్ వల్ల వచ్చే నష్టాలు, ఆర్థికంగా కలిగే నష్టం గురించి పలువురు మాట్లాడుతున్నారు. ఇది ఒకరకంగా అసందర్భపు ప్రేలాపన. ఇల్లు తగలబడుతున్నప్పుడు ఒకవైపు ఆ మంటలను ఆర్పే ప్రయత్నం, మరోవైపు మంటలలో తగలబడే ప్రమాదమున్న వాటిలోనుంచి ముఖ్యమైన వాటిని వెలుపలికి తీసుకురావడం ఎవరైనా చేసే పని. మంటలు విస్తరించకుండా చర్యలు తీసుకునే సమయంలో అగ్ని ప్రమాద నష్టం గురించిన ఆలోచన చెయ్యరు. నష్ట నివారణకు తీసుకుంటున్న ముఖ్యమైన చర్యే లాక్ డౌన్.

కరోనా ప్రమాదం సమసిన తర్వాత ఆర్థిక ప్రగతికి ఏమి చేయాలనేది సమష్టిగా ఆలోచించాల్సిన విషయం. ఏమి చేస్తే మేలైన ఫలితాలు సాధించగలమో నిపుణులు సూచించవచ్చు. రాజకీయ, స్వార్ధ  ప్రయోజనాలకు ఆవల చర్చలు, సూచనలు రెండూ ఉండి తీరాలి.  ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసింది కూడా. అజిత్ దోవల్ నేతృత్వంలో ఒక కమిటీ తన పనిని ఇప్పటికే ప్రారంభించింది.

ప్రస్తుతం చేయాల్సింది సామాన్యులను ఆదుకోవటం. భారతీయులకు భరోసా కల్పించడం. నష్టం ఎంతటిదైనా తట్టుకుని నిలబడగలమన్న ఆత్మస్థైర్యాన్ని నింపటం. సహాయ చర్యలకు సహకరించటం. కరోనా వ్యాప్తిని అరికట్టే పద్ధతులు పాటించటం మనందరి కర్తవ్యం. వీటికి ఆవల మిగిలినవి ఏవైనా నింపాదిగా మాట్లాడుకుందాం, చర్చిద్దాం అనేది జాతీయ విధానం కావాలి.

– డా. దుగ్గరాజు శ్రీనివాసరావు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.