ArticlesNews

భక్తి సంప్రదాయాన్ని పరాకాష్ఠకు చేర్చిన నామదేవు

41views

(కార్తిక శుక్ల ఏకాదశి, నవంబర్ 20 : సంత్‌ నామదేవ్‌ జయంతి)

భారతదేశపు సాంస్కృతిక చరిత్రలో, ప్రధానంగా భక్తి సంప్రదాయంలో సంత్ నామదేవ్ ప్రసిద్ధులు. సామాన్యశకం 1270లో కార్తిక శుక్ల ఏకాదశి తిథినాడు నాటి దక్కన్ ప్రోవిన్స్, అంటే నేటి మహారాష్ట్రలోని పర్భని జిల్లా నర్సీబామిని గ్రామంలో దర్జీల కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి దామాసేథ్, తల్లి గోనాబాయి. వారు పండరీపురంలో కొలువైఉన్న విఠల భగవానుడి భక్తులు. కొన్నాళ్ళకు వారు పండరీపురానికి మకాం మార్చేసారు. నామదేవుడికి రజాబాయితో వివాహమైంది. వారికి నలుగురు కొడుకులు, ఒక కుమార్తె.

అప్పట్లో ముస్లిముల ఏలుబడిలోని దక్కన్ ప్రాంతంలో హిందువులపై ముస్లిం అధికారుల ఆగడాలకు అంతే లేదు. అలాంటి సమయంలోనూ, నామదేవుడికి భక్తి తప్ప మరేమీ తెలిసేది కాదు. పాండురంగడిపై ఆయన భక్తిభావం పరాకాష్ఠకు చేరింది. కుటుంబ బంధాలూ, లౌకిక వ్యవహారాలపై ఆసక్తి పోయింది. పూర్తిస్థాయిలో ఆధ్యాత్మిక విషయాల్లో మునిగిపోయాడు. భజనలు, సంకీర్తనలే ఆయన లోకమైపోయాయి.

నామదేవుడికి 20యేళ్ళ వయసులో పండరీపురంలో సంత్ జ్ఞానేశ్వరుణ్ణి కలుసుకున్నాడు. జ్ఞానేశ్వర్ వెంటనే నామదేవుడికి ఆకర్షితులయ్యారు. తనతో పాటు తీర్థయాత్రలకు రావాలని ఒత్తిడి చేసారు. పాండురంగ విఠలుడిని వదలలేక నామదేవుడు మొదట ఒప్పుకోలేదు కానీ తర్వాత మనసు మార్చుకున్నాడు. నాటినుంచీ నామదేవుడు, జ్ఞానేశ్వరుడు చివరివరకూ కలిసే ఉన్నారు. వారిద్దరూ దేశంలోని దాదాపు అన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలూ దర్శించారు. ఆ క్రమంలో పంజాబ్ చేరుకున్న నామదేవుడు అక్కడ ఘుమాన్ గ్రామంలో 17ఏళ్ళు ఉండిపోయారు. అక్కడ ధ్యానం, సంకీర్తనల్లో నిమగ్నమైపోయారు. సిఖ్ఖుల ఐదవ గురువు అర్జన్‌దేవ్‌జీ ‘గురుగ్రంథసాహెబ్’ను సంకలనం చేసినప్పుడు అందులో భక్తి ఉద్యమానికి చెందిన సాధువుల బోధనలను కూడా చేర్చారు. అలా నామదేవుడు రచించిన అభంగాలకు గురుగ్రంథసాహెబ్‌లో చోటు దక్కింది.

నామదేవుడు పరమాత్ముణ్ణి సగుణ, నిర్గుణ రూపాలు రెండింటిలోనూ అర్చించారు. జ్ఞానేశ్వరుడు ప్రారంభించిన పండరీపుర యాత్ర సంప్రదాయాన్ని నామదేవుడు ముందుకు తీసుకెళ్ళారు. మరాఠీ హిందువులు తమతమ ప్రదేశాల నుంచి పండరీపురానికి యాత్ర చేసే పద్ధతి ప్రజాదరణ పొందింది. మరాఠీలో యాత్రను వారీ అంటారు. అందువల్ల పండరీపుర పుణ్యక్షేత్రానికి పవిత్ర యాత్ర చేసేవారిని వార్కరీ అనడం ఆనవాయితీగా మారింది. అలా ఏర్పడిన వార్కరీ తెగ వారు, నామదేవుణ్ణి తమ సంప్రదాయానికి చెందిన ప్రముఖ సాధువుగా నేటికీ గౌరవిస్తారు. నేటికీ నామదేవుడు సమకూర్చిన అభంగాలను యావత్ మహారాష్ట్ర అంతటా భక్తులు శ్రద్ధాభక్తులతో ఆలపిస్తూంటారు.

నామదేవుడు ఉత్తరభారతంలో భక్తి సంప్రదాయాన్ని విస్తృతం చేసారు. ఆయన సహచరులు, అనుచరుల్లో నాట్యగత్తె, క్షురకుడు, తోటమాలి, అస్పృశ్యుడు, పనిమనిషి, కుమ్మరి, కమ్మరి, బ్రాహ్మణుడు… ఇలా అన్నికులాలవారూ ఉండేవారు. రాజస్థాన్‌లో ప్రముఖమైన దాదూపంథ్ సంప్రదాయంలోని ఐదుగురు గురువుల్లో నామదేవుడు ఒకరు. నేటికీ దాదూపంథీలు నామదేవుడి అభంగాలు పెద్దసంఖ్యలో ఆలపిస్తారంటే ఆయన ప్రభావం ఎంతటిదో అర్ధం చేసుకోవచ్చు.