
సముద్రంలో ఎన్ని నదులు కలిసినా అది ఎలాగైతే తన గంభీరతను కోల్పోదో, అలాగే ఎన్ని కోరికలు తలెత్తినా చలించని వాడే శాంతిని పొందుతాడు – భగవద్గీత.
చాలామంది ప్రశాంతత కోసం విహార యాత్రలకు వెళ్తుంటారు లేదా ఏకాంత ప్రదేశాలను వెతుక్కుంటారు. కానీ తిరిగి రాగానే పాత అశాంతి మళ్ళీ మొదలవుతుంది. దీనికి కారణం శాంతి అనేది ఒక ప్రదేశానికి సంబంధించినది కాదు, అది మన:స్థితికి సంబంధించినది. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండటం సహజం, కానీ తుపానులాంటి కష్టాల మధ్య కూడా చెక్కుచెదరకుండా ఉండటమే అసలైన శాంతి.
మనం బాహ్య ప్రపంచంలో వెతుక్కునే ఆనందం నీటిలోని సూర్యుడి వంటిది. ఒక వస్తువు దొరికినప్పుడో, ఒక కోరిక తీరినప్పుడో కలిగే ఆనందం ‘ప్రతిబింబం’ మాత్రమే. అది వస్తువు మీదో, వ్యక్తి మీదో లేదా సందర్భం మీదో ఆధారపడి ఉంటుంది. ఆ వస్తువు దూరం కాగానే లేదా ఆ సందర్భం మారిపోగానే, ఆనందం కూడా మాయమవుతుంది. దీన్నే వేదాంతం ‘మిథ్య’ లేదా ‘భ్రాంతి’ అంటుంది. శాశ్వతమైన ఆనందాన్ని సొంతం చేసుకోవడం అంటే ఏదో కొత్త వస్తువును సంపాదించడం కాదు, మనపై పేరుకుపోయిన అజ్ఞానపు పొరలను తొలగించు కోవడమే. నీటిలోని ప్రతిబింబాన్ని చూసి సూర్యుడు అనుకోవడం భ్రాంతి అని తెలిసినప్పుడు, సహజంగానే మన చూపు ఆకాశం వైపు మొగ్గుతుంది.
సనాతన ధర్మంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇద్దరూ ‘ఆనందం’ అనే (ఆనందామృతం) పరమార్ధాన్ని వేర్వేరు కోణాల్లో, వారి జీవితాచరణ ద్వారా ఉపదేశాల ద్వారా అందించారు.
శ్రీరాముడు చెప్పే ఆనందామృతం
శ్రీరాముడు తన జీవితాన్నే ఒక ఉపదేశంగా మలిచాడు. అధ్యాత్మ రామాయణం (రామగీత), యోగవాసిష్టం వంటి గ్రంథాలలో రాముడు చెప్పిన ఆనంద స్వరూపానికి ధర్మాచరణే మార్గం. లౌకికమైన భోగాలు, సంపదలు కుక్క ఎండు ఎముకను నమిలి, తన రక్తాన్నే రుచి చూసి ఆనందించినట్లు ఉంటాయి. బయటి వస్తువుల్లో ఆనందం ఉందనుకోవడం కేవలం భ్రమ. ‘ఆత్మా రామ ఆనంద రమణ’ – శ్రీరాముడి ఉద్దేశంలో నిజమైన ఆనందం మన అంతరాత్మలోనే ఉద్భవిస్తుంది. మనస్సు రాగద్వేషాలకు అతీతంగా ఉన్నప్పుడు, ఏ పరిస్థితిలోనైనా స్థిరంగా ఉన్నప్పుడు కలిగే ప్రశాంతతే ఆనందామృతం. బాధ్యతలను, ధర్మాన్ని నిష్కామంగా నిర్వహించినప్పుడు హృదయం నిర్మలమవుతుంది. ఆ నిర్మలత్వమే ఆనందానికి మూలం.
శ్రీకృష్ణ పరమాత్మ
‘యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే’(గీత 5.22) ఇంద్రియాలు, వస్తువులవల్ల కలిగే ఆనందం మొదట్లో అమృతంలా అనిపించినా, చివరకు విషంలా మారుతుంది. ఆత్మలోనే ఆనందం (ఆత్మరతి). ‘యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః’ (గీత 3.17) ఎవరైతే తన ఆత్మలోనే రమిస్తూ, ఆత్మయందే తృప్తిగా ఉంటారో వారికి బయటి ప్రపంచంతో పనుండదు. వారే నిజమైన శాశ్వతానందాన్ని పొందుతారు. మొదట్లో కష్టంగా, అభ్యాసంలా అనిపించినా, చివరికి అమృతంలా మారేదే సాత్వికానందం. ఇది ఆత్మజ్ఞానం నుండి ఉద్భవిస్తుంది. ‘నన్ను ఆశ్రయించు, సమస్త కర్మఫలాల పట్ల ఆసక్తిని వదిలేయ’ని చెప్పడం ద్వారా, అహంకారం తొలగిన క్షణంలో లభించే భక్తిరస అమృతాన్ని కృష్ణుడు చూపించాడు.
ఇద్దరూ చెప్పిన సత్యం ‘ఆనందం అనేది పొందేది కాదు, అది నీ అసలు స్వరూపం. బయటి ప్రపంచమనే నీటిలోని ప్రతిబింబాన్ని వదిలి, నీ లోపల ఉన్న బింబాన్ని (ఆత్మను) దర్శించడమే నిజమైన ఆనందామృతం’.
లోకంలో మనం చూసే శాంతి వేరు, ఆధ్యాత్మికంగా మనం వెతకాల్సిన శాంతి వేరు. యుద్ధాలు లేకపోవడమో, శబ్దాలు లేకపోవడమో శాంతి కాదు. అది కేవలం నిశ్శబ్దం మాత్రమే. మరి అసలైన శాంతి అంటే ఏమిటి? అది మనకు ఎలా లభిస్తుంది?
మానవ జీవితం నిరంతరం ఏదో ఒక వెతుకులాటలోనే సాగుతుంటుంది. కొందరు ధనం కోసం, మరి కొందరు కీర్తి కోసం, ఇంకొందరు భౌతిక సుఖాల కోసం అన్వేషిస్తుంటారు. కానీ వీటన్నింటి వెనుక ఉన్న అంతిమలక్ష్యం మాత్రం ఒక్కటే – అది ‘ఆనందం’. అయితే, లౌకిక విషయాల ద్వారా పొందే ఆనందం క్షణికం. శాశ్వతమైన, పరిపూర్ణమైన ఆనందాన్నే ఆధ్యాత్మిక పరిభాషలో ‘ఆనందా మృతం’ అంటారు.
ఆనందామృతాన్ని రుచి చూడాలంటే మనస్సు నిశ్చలంగా ఉండాలి. సముద్రం అలలు లేకుండా ఉన్నప్పుడే దాని లోతు కనిపిస్తుంది. అలాగే మనస్సు ఆలోచనలు లేని మౌన స్థితిలో ఉన్నప్పుడే అంతరాత్మలోని ఆనందం అనుభవంలోకి వస్తుంది. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చేయడంవల్ల అంతర్గత ప్రయాణం సులభతరం అవుతుంది.
‘ఆనందం’ అనేది ఎక్కడో ఆకాశంలోనో, అడవుల్లోనో లేదు. అది మనలోనే ఉంది. అరిషడ్వర్గాలను (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) వదిలి, అహంకారాన్ని తగ్గించుకున్నప్పుడు మన హృదయం ఆనందనిలయమవుతుంది. నిరంతర సాధన, సేవాభావం, దైవచింతన అనే పాత్రలతో ఆ అమృతాన్ని మనం నిత్యం గోలవచ్చు. మనం పొందే లౌకిక సుఖాలు ఆనందానికి సూచికలే కానీ, అవే ఆనందం కాదు. ఆ ప్రతిబింబాన్ని చూసి మురిసిపోవడం సహజమే, కానీ అదే శాశ్వతం అనుకోవడమే భ్రమ. ఆ ప్రతిబింబానికి మూలమైన ‘బింబాన్ని’ (అంటే, తనలో ఉన్న ఆత్మను) పట్టుకున్నవాడే అసలైన సచ్చిదానందాన్ని పొందుతాడు.
శ్రీరాముడు – వసిష్ఠుల సంవాదం (యోగావాసిష్ఠం)
యోగావాసిష్ఠంలో యువకుడైన శ్రీరాముడు ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యంతో ఉన్నప్పుడు, బ్రహ్మర్షి వసిష్ఠుడు ఆనందం పరమార్థాన్ని బోధిస్తాడు.‘రాజ్యాలు, సుఖాలు, బంధాలు అన్నీ అనిత్యమైనవి. ఈ సంసారంలో శాశ్వతమైన ఆనందం ఎక్కడుంది’ అన్న శ్రీరాముని ప్రశ్నకి ‘రామా! నీటిలో అలలు ఎలాగైతే వచ్చిపోతుంటాయో, బాహ్య ప్రపంచంలోని సుఖదుఃఖాలు కూడా అలాగే వచ్చిపోతాయి. మనస్సు ఆలోచనలు లేని నిశ్చల స్థితికి చేరినప్పుడు, స్వచ్ఛమైన ఆత్మ ప్రకాశిస్తుంది. ఆ ఆత్మస్వరూపమే ఆనందామృతం’ అని వసిష్ఠుడు సమాధానం ఇస్తాడు.
సనత్కుమారుడు – నారదుల సంవాదం (ఛాందోగ్య ఉపనిషత్తు / భాగవతం)
సమస్త వేదాలు, శాస్త్రాలు చదివినప్పటికీ నారదమహర్షికి మనశ్శాంతి లభించలేదు. ఆయన సనత్కుమారుని ఆశ్రయించి ఆనందం గురించి ప్రశ్నిస్తాడు. ‘మహర్షీ! నేను అపారమైన విద్యను నేర్చుకున్నాను కానీ శోకాన్ని దాటలేకపోతున్నాను. శాంతి, ఆనందం ఎలా లభిస్తాయి’? అప్పుడు సనత్కుమారుడు, ‘యో వై భూమా తత్సుఖమ్, నాల్పే సుఖమస్తి’ పరిమితమైన (అల్పమైన) వస్తువుల్లో, విషయాల్లో ఆనందం లేదు. అనంతమైన దాంట్లోనే (పరమాత్మ) ఆనందం ఉందని సమాధానమిస్తాడు. బయటి వస్తువులపై ఆధారపడటం మాని, అనంతమైన అంతరాత్మలో లయమైనప్పుడే అమృతత్వం సిద్ధిస్తుంది.
భక్త ప్రహ్లాదుడు (శ్రీమద్భాగవతం)
రాక్షసరాజైన హిరణ్యకశిపుడు భోగాలు, అధికారం ద్వారా ఆనందాన్ని పొందే విఫలయత్నం చేస్తే, చిన్ననాటి నుంచే ప్రహ్లాదుడు నిజమైన ఆనందాన్ని అనుభవించాడు. ‘మృగతృష్ణ (ఎండమావులు) నీరు ఉన్నట్లు భాసించే భ్రాంతి మాత్రమే. అలాగే ఇంద్రియసుఖాల ద్వారా లభించే ఆనందం కూడా ఒక భ్రాంతి. హరిచింతన, శరణాగతి అనే అమృతాన్ని గ్రోలినవానికి ప్రపంచంలోని ఏ కష్టవ• దుఃఖాన్ని ఇవ్వలేదు. భగవత్ చింతనే నిజమైన ఆనందామృతం’ అని చాటిచెప్పాడు.
సూత – శౌనకాది మహర్షులు (పురాణ సారం)
పురాణాలను అందించి, వివరించిన సూతమహర్షి పురాణాల ముగింపులో ఆనందం గురించి ఇలా వివరిస్తాడు. నామస్మరణ అమృతం. అజ్ఞానంతో నిండిన సంసార చక్రం నుండి బయటపడటానికి, నిత్య ఆనందంలో తేలడానికి భగవన్నామ స్మరణ, నిష్కామ సేవే సాధనాలు. కర్మఫలాన్ని ఆశించకుండా ధర్మాన్ని ఆచరించడమే చిత్తశుద్ధిని, తద్వారా అమృతానందాన్ని ఇస్తుంది.
పురాణపురుషులందరూ ఏకగ్రీవంగా చెప్పిన సత్యం ఒక్కటే – నీటిలోని సూర్యుడి ప్రతిబింబాన్ని చూసి నిజమైన సూర్యుడనుకోవడం ఎలా భ్రాంతో, లౌకిక వస్తువుల ద్వారా పొందే సుఖం కూడా అలాగే భ్రాంతి. ఆ ప్రతిబింబానికి వ•లమైన అసలైన ఆత్మను (బింబాన్ని) తెలుసుకోవడమే నిజమైన ఆనందామృతం.
-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి





