News

గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ కల్పనపట్ల కృతజ్ఞతలు తెలిపిన ఉత్సవ సమితి

34views

అమరావతి: వినాయక చవితి పర్వదినాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు సింగిల్ విండో ద్వారా అనుమతులకు చొరవ చూపిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఆంధ్రపదేశ్ గణేష్ ఉత్సవ సమితి కృతజ్ఞతలు తెలిపింది.

ఈ మేరకు సచివాలయంలో మంత్రి లోకేష్ ను కలిసిన ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు.. వినాయక మండపాలకు ఉచిత్ విద్యుత్, సింగిల్ విండో అనుమతుల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గణేష్ ఉత్సవాలు విజయవంతం కావడానికి వివిధ ప్రభుత్వ విభాగాలు ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితితో సమన్వయం చేసుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు.

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసేలా వినాయక మండపాల్లో రెండుపూటలా పూజానంతరం వరుణజపం చేయడానికి ముద్రించిన సంకల్పం, బీజాక్షర మంత్రం కరపత్రాన్ని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో గణేష్ మండపాల వద్ద ఏర్పాటుచేసేందుకు కావల్సిన కాషాయధ్వజాలు, పర్యావరణహిత బ్యానర్లు, వినాయక వ్రతకల్పం పుస్తకాలను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరమాచినేని రంగ ప్రసాద్, బీవీ రమణ కుమార్, ప్రధాన కార్యదర్శి పాకాల త్రినాథ్, కార్యదర్శి వలివర్తి దుర్గాప్రసాద్, ప్రభుత్వ సంబంధాల కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.