
ఆదోని పట్టణంలో గణేష్ ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కోరారు. స్థానిక విశ్వహిందూ పరిషత్ కార్యాలయం ఎదుట పట్టణ గణేష్ ఉత్సవాల ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాల నిర్వహణలో మండపాల నిర్వాహకులు పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించుకోవాలని కోరారు.
ఉత్సవాలకు సంబంధించిన అనుమతుల కోసం సింగిల్ విండో విధానం ద్వారా కేంద్ర కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ సేవలు ప్రారంభమైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. మండపాల నిర్వాహకులు తమ పేర్లను నమోదు చేసుకుని అధికారులకు సహకరించాలని సూచించారు.
గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు, భక్తులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు.





