
జబల్ పూర్ : విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ అఖిల భారతీయ కార్యకారిణి సమావేశాలు ఈ నెల 11 న ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జబల్ పూర్ లోని సరస్వతీ శిక్షా పరిషత్ లో జరుగుతున్నాయి. డాక్టర్ రవీంద్ర కన్హేరే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి అఖిల భారత ప్రధాన కార్యదర్శి దేశ్‌రాజ్ జీ శర్మ మరియు వివేక్ షెండే తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ మూడు రోజుల సమావేశాల్లో సంస్థాగత అంశాలతో పాటు మరింత నాణ్యమైన విద్యను అందించడం, దేశంలో విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కార మార్గాలపై చర్చలు జరుగుతాయి. ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవాహ డాక్టర్ కృష్ణ గోపాల్ ఈ మూడు రోజుల పాటు జరుగుతున్న సమావేశాల్లో పాల్గొంటారు.
ఇక.. ఈ విషయంపై విద్యా భారతి మహా మంత్రి దేశరాజ్ శర్మ మాట్లాడుతూ విద్య నాణ్యతను పెంచడం, నైపుణ్యాలు, జాతీయ చైతన్యం, విలువలు అన్న నాలుగు అంశాలను మిళితం చేయడం ద్వారానే విద్య ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతుందన్నారు. దీని ద్వారా ప్రపంచ అభివృద్ధికి మరియు ప్రపంచ సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందన్నదే తాము బలంగా విశ్వసిస్తున్నామని అన్నారు.
ఈ మూడు రోజుల సమావేశాల్లో విద్యా భారతి పాఠశాలల్లో మరింత విద్యా ప్రమాణాలను పెంచడం, వాటిని అభివృద్ధి చేయడంపైనే చర్చ జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే జాతీయ విద్యా విధానం 2020, భారతీయ జ్ఞాన సంప్రదాయాలు, మాతృభాష, నైపుణ్యాలు, అనుభవపూర్వక అభ్యాసం, పంచకోశాత్మక విద్యా ఆధారంగా సంపూర్ణ విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా చర్చ జరుగుతుందన్నారు.
పాఠశాలల కార్యకలాపాలలో ఈ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి ‘విద్యా భారతి’ చేస్తున్న ప్రయత్నాలను కూడా చర్చిస్తారన్నారు. భారతీయ జ్ఞాన సంప్రదాయం ఆధునిక విజ్ఞానానికి లేదా సాంకేతికతకు వ్యతిరేకం కాదని, పైగా వాటిని భారతీయ దృక్పథంతో సమన్వయం చేసుకోవాలని కోరుకుంటుందని, విద్యా భారతి ఆశయం కూడా ఇదేనని దేశ్ రాజ్ శర్మ అన్నారు.
విద్యార్థులు ఆధునిక విజ్ఞానంతో సాధికారత పొంది, తమ మూలాలతో అనుసంధానమైనప్పుడు మాత్రమే భారతదేశం ప్రపంచ పురోగతికి మరియు శాంతికి తనవంతు కృషి చేయగలదన్నారు.
విద్యా భారతి 24,000 అధికారిక మరియు అనధికారిక పాఠశాలలను నిర్వహిస్తోందని,విద్యను సమకాలీనంగా, జాతీయ అవసరాలకు అనుగుణంగా, సర్వవ్యాపకంగా మరియు సమ్మిళితంగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన కార్యాచరణపై కూడా చర్చిస్తామని తెలిపారు.
మారుతున్న ప్రపంచ పరిస్థితులు మరియు భారతదేశ పాత్రను దృష్టిలో ఉంచుకుని, పాఠశాలలను కేవలం పర్యావరణ విద్యను బోధించే వేదికలుగానే కాకుండా, దీర్ఘకాలిక ప్రయోగశాలలుగా తీర్చిదిద్దడంపై కూడా చర్చిస్తామన్నారు. శారీరిక విద్య, యోగా, సంగీతం, సంస్కృతం, నైతిక ఆధ్యాత్మిక విద్య అనే ఐదు అంశాల ద్వారా భారతీయ జీవన విధానాన్ని విద్యా విధానంలో మిళితం చేస్తూ, పాఠశాలలు ఆదర్శవంతంగా రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు.
మరో వైపు వందేమాతరం గీతానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా అంటే సెప్టెంబర్ 25 వ తేదీన కోట్లాది మంది విద్యార్థులు ఒకే శైలి, ఒకే క్రమాన్ని పాటిస్తూ జాతీయ గీతాన్ని ఆలాపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు మరియు డాక్యుమెంటేషన్‌ను కార్యనిర్వాహక కమిటీ ఖరారు చేస్తుందన్నారు.





