News

పర్యావరణ హిత వినాయక విగ్రహాలనే పూజిద్దాం: రామ్మోహన్ నాయుడు

2views

వినాయక చవితిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు స్థానిక కులవృత్తులకు ప్రోత్సాహం అందించినట్లవుతుందని అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. విద్యార్థినులకు స్వయంగా విగ్రహాలను పంపిణీ చేశారు.

వినాయక చవితి వేడుకలను మట్టి విగ్రహాలు, పర్యావరణానికి హాని చేయని వస్తువులతో నిర్వహించి నిజమైన భక్తిని చాటాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కళాశాలలో నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు తన చేతుల మీదుగా మట్టి విగ్రహాలను అందజేశారు.

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి సూచించారు. వినాయక చవితి సందర్భంగా రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను వినియోగించాలని కోరారు.

స్థానిక కుమ్మరులతో ప్రత్యేకంగా మాట్లాడి మట్టి విగ్రహాలను తయారు చేయించినట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన “వోకల్ ఫర్ లోకల్” పిలుపును దృష్టిలో పెట్టుకుని స్థానిక కులవృత్తులకు మరింత ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

స్థానిక కళాకారులు, కుమ్మరులకు అండగా నిలవడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించేలా ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్‌లో మరింత విస్తృతంగా నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని వినాయక మండపాలన్నింటికీ ఉచిత విద్యుత్‌ అందించాలన్న మంత్రి నారా లోకేష్‌ ఆలోచనను రామ్మోహన్ నాయుడు అభినందించారు. వినాయక చవితి వేడుకలను ప్రజలంతా కలిసి ఆనందంగా, పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని కోరారు.

రాబోయే వినాయక చవితిని పది మంది కలిసి మరింత ఉత్సాహంగా జరుపుకోవాలని, పండుగతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు.