ArticlesNews

మిషనరీలు, మావోయిస్టులు బలితీసుకున్న గిరిజన సేవకుడు

15views

( ఆగస్టు 23 – స్వామి లక్ష్మణానంద సరస్వతి బలిదాన దినం )

‘వేదాంత కేసరి’గా ఖ్యాతి గడించిన స్వామి లక్ష్మణానంద సరస్వతిని 2008లో ఆగస్టు 23 శ్రీకృష్ణాష్టమి పర్వదినం నాడు దారుణంగా హత్య చేసారు. ఒడిషా గిరిజన ప్రాంతాల్లో మతమార్పిడులు జరగకుండా ఆపుతున్న కారణానికే ఆయన హత్య జరిగింది. కంధమాల్ జిల్లాలో గిరిజనుల సంక్షేమం కోసం నాలుగు దశాబ్దాలకు పైబడి సేవలు చేస్తున్న స్వామీజీని నక్సలైట్లు చంపివేయడం, వారికీ క్రైస్తవ మిషనరీ మాఫియాకూ ఉన్న బలమైన సంబంధాలకు నిదర్శనం.

కంధమాల్ అనబడే ఫూల్‌బనీ జిల్లా గురజంగ్ గ్రామంలో 1924లో జన్మించిన స్వామి లక్ష్మణానంద సరస్వతి బాల్యం నుంచే ఆధ్యాత్మిక, సామాజిక భావజాలం కలిగి ఉండేవారు. పెళ్ళయి, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆయన ఆధ్యాత్మిక సాధన కోసం హిమాలయాలకు వెళ్ళిపోయారు. 1965లో మళ్ళీ స్వస్థలానికి వచ్చాక, గోరక్షా ఉద్యమంలో పాల్గొన్నారు. అనంతరం, గిరిజనులు ఎక్కువగా ఉండే కొంధమాల్ జిల్లాలోని చక్‌పదా గ్రామంనుంచి తన సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. అక్కడ 1969లో గురుకుల పాఠశాల, కళాశాల, ఆశ్రమం స్థాపించి సాధారణ విద్యతో పాటు వేదవిద్యనూ నేర్పించేవారు. కొంతకాలానికి సమీపంలోని జలేస్‌పట గ్రామంలో గిరిజన బాలికల కోసం శంకరాచార్య కన్యాశ్రమం అనే గురుకుల పాఠశాల ప్రారంభించారు. వయోజనులకు రాత్రిబడి మొదలుపెట్టారు. నాలుగు దశాబ్దాల పాటు ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించారు.

గిరిజన సంస్కృతి, ధర్మ పరిరక్షణ కోసం పాటుపడిన స్వామి లక్ష్మణానంద, ఒడిషా గిరిజన ప్రాంతాల్లో మతమార్పిడులకు అడ్డుగోడగా నిలబడిపోయారు. విశ్వహిందూ పరిషత్ నాయకుడైన స్వామి లక్ష్మణానంద ఒడిషా అడవుల్లో ఎన్నో గుడులను పునరుద్ధరించారు, ఎన్నో మఠాలు ప్రారంభించారు. ప్రత్యేకించి, ధరమని పేను అనే గిరిజన దేవాలయాలను పెద్దసంఖ్యలో స్థాపించి, ఒడిషా గిరిజనుల మంతాతరీకరణ ప్రయత్నాలను క్రైస్తవ మిషనరీల ప్రయత్నాలకు గండికొడుతూ సనాతన ధర్మానికి కాపుకాసారు. అందుకే గోవర్ధన పీఠం శంకరాచార్యులు ఆయనకు ‘విధర్మీ కుచక్ర విదారణ మహారథి’ అనే బిరుదునిచ్చారు.

పర్యావరణ పరిరక్షణలోనూ స్వామి పాత్ర గొప్పది. కంధమాల్ జిల్లా అంతటా అడవులు పెంచారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక చెట్టును కొట్టాలన్నా గ్రామకమిటీ అనుమతి తప్పనిసరి చేసారు. ఇవాళ ప్రభుత్వాలు చేస్తున్న అటవీ పరిరక్షణ కార్యక్రమాలను స్వామి లక్ష్మణానంద 1970లలోనే మొదలుపెట్టారు.

స్వామి లక్ష్మణానంద సేవాకార్యక్రమాలు సహజంగానే క్రైస్తవ మతమార్పిడి మాఫియాకు కంటగింపుగా మారాయి. 1969 నుంచీ ఆయనపై 8 హత్యాప్రయత్నాలు జరిగాయి. ఒక్క 2008లోనే ఆగస్టు 10 నుంచి 21లోపు మూడు బెదిరింపు లేఖలు వచ్చాయి. లక్ష్మణానంద శిష్యులు ఎన్నిసార్లు పోలీసు భద్రత కోసం అర్ధించినా ప్రయోజనం లేదు. చివరికి ఆగస్టు 23నే ఆయనకు భద్రత ఏర్పాటుచేసారు. ఆ రాత్రే ఏకే-47 తుపాకులు ధరించిన దుండగులు పోలీసులను నిర్బంధించి మరీ దాడికి పాల్పడ్డారు.

2008 ఆగస్టు 23న, శంకరాచార్య కన్యాశ్రమంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఉన్న స్వామిని 15మంది సాయుధ దుండగులు కాల్చిచంపారు. ఆ క్రమంలో మరో ఐదుగురు శిష్యులు సైతం ప్రాణాలు కోల్పోయారు. తుపాకీ తూటాలకు నేలకొరిగిన 84ఏళ్ళ లక్ష్మణానంద మృతదేహాన్ని ఆ దుర్మార్గులు కత్తులతో ముక్కలుముక్కలుగా నరికి పోగులు పెట్టారు. క్రైస్తవ మిషనరీ మాఫియా నిధులతో మావోయిస్టులు ఆ ఘాతుకానికి పాల్పడ్డారని ఆశ్రమవాసులు, స్వామి శిష్యులు, హిందూసంస్థలూ ఆరోపించాయి.

క్రైస్తవ మతమార్పిడి మాఫియా నుంచి గిరిజనులను, స్వధర్మాన్ని రక్షించుకోవడం కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన మహనీయుడు స్వామి లక్ష్మణానంద సరస్వతి.