
కరోనా వైరస్ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఉదయమే రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసిన ఆయన ఆ తర్వాత మీడియాతో ప్రతినిధులతో సమావేశం అయ్యారు. సాయంత్రం వ్యాపారవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో అవసరమైన వస్తువుల ఉత్పత్తిపై ప్రభావం చూపకుండా చూసుకోవాలని పరిశ్రమ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వారిని కోరారు.
ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాలని, అలా వీలుపడని క్రింది స్థాయి ఉద్యోగులను పనిలోంచి తొలగించవద్దని, వారి విషయంలో మానవీయ విధానాన్ని అవలంబించవలసిందిగా ప్రధాని అభ్యర్ధించారు. అలాగే బ్లాక్ మార్కెటింగ్ కు కూడా పాల్పడవద్దని ప్రధాని వారిని ఆదేశించారు.
“ఈ మహమ్మారిని ఎదుర్కొనే సవాలు ప్రపంచ యుద్ధాల కంటే పెద్దది. దాని వ్యాప్తిని నివారించడానికి మనం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి” అని ప్రధాని వారితో వ్యాఖ్యానించారు.
“ఇది లాభ నష్టాల గురించి ఆలోచించే సమయం కాదు. విశ్వాసాన్ని వెల్లడించాల్సిన సమయం. మన విశ్వాసమే కొలబద్దగా ముందుకు సాగాల్సిన సమయమిది.” అని ఆయన అన్నట్లుగా వారి ప్రకటనలో తెలిపారు.
పర్యాటక, నిర్మాణ, ఆతిథ్య, నిత్యావసర, సమాచార రంగాలపై కోవిడ్ – 19 ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నదని, వారు తమ ఉపాధిని కోల్పోకుండా చూడాలని, ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా నిలవాలని ప్రధాని పారిశ్రామిక ప్రతినిధులను కోరారు.
వైద్య పరికరాలను అధిక ధరలకు విక్రయించకుండా చూడాలని, భవిష్యత్తులో ముడి సరుకు దొరకదేమోనన్న భయంతో అతిగా ముడి సరుకును నిల్వ ఉంచుకునే ప్రయత్నాలు కూడా చెయ్యవద్దని ఆయన వారికి విన్నవించారు.
వెంటిలేటర్స్, శానిటైజర్స్, అవసరమైన మందులు, వైద్య సేవలు, లాభాపేక్షలేని విధంగా అందజేస్తామని, వైద్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి అవసరమైన సిబ్బందిని, వాలంటీర్లను ఏర్పాటు చెయ్యడం, అవసరమైన పరికరాల తయారీ మరియు లభ్యతను పెంచడానికి తమ సభ్య సంస్థలు పని చేస్తాయని ఆ సంస్థలు హామీ ఇచ్చాయి.
“ఆర్థిక వ్యవస్థపై COVID-19 ప్రభావం రాబోయే కొంతకాలం ఉంటుంది. అతి త్వరలో మనం దీనిని అధిగమిస్తాం. ప్రభుత్వం అందుకు మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది.” అని ప్రధాని మోడీ వారికి భరోసా ఇచ్చారు.





