
హిందూ చైతన్యాన్ని సాంస్కృతిక, సైద్ధాంతిక వ్యక్తీకరణగా పరిగణిస్తున్న ఆర్ఎస్ఎస్‌కు చట్టపరమైన నమోదు అవసరమా అనే ప్రశ్న అంతటా వినవస్తున్నది. ఆర్ఎస్ఎస్ ఒక స్వచ్ఛంద, వాణిజ్యేతర సామాజిక సంస్థగా పనిచేస్తుందని వాదించడం ద్వారా, దీనికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాలన్న ఇటీవలి రాజకీయ డిమాండ్లను ఇది తోసిపుచ్చుతున్నది.
ఆర్ఎస్ఎస్ అనేది హిందూ సమాజాన్ని సంఘటితం చేసి, చైతన్యవంతం చేసిన ఒక మహావృక్షం (మర్రిచెట్టు) వంటిది. అది అనేక కొమ్మలు, రెమ్మలు, తీగలుగా విస్తరించింది. ఈ శాఖలన్నీ స్వతంత్రంగా పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అందువల్ల, దీనికి ఒకే ఒక మూలాన్ని వెతకడం అనేది నిష్ప్రయోజనమైన మేధోపరమైన కసరత్తు మాత్రమే అవుతుంది. అయినప్పటికీ, దీని అంతర్భాగం ఎప్పటికీ దృఢంగా, సందర్భోచితంగానే ఉంది. ఎందుకంటే దీని వేర్లు భారతీయ నేలలోని మౌలిక ఆదర్శాలు, త్యాగాలతో లోతుగా పెనవేసుకుని ఉన్నాయి. దీనికి అధికారిక నమోదు (రిజిస్ట్రేషన్) కావాలని కోరడం లేదా అధికార యంత్రాంగ నిబంధనలను పాటించాలని డిమాండ్ చేయడం అనేది గాలిని బంధించడానికి ప్రయత్నించడం లాంటి వ్యర్థమైన పని.
ఇటీవల ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ మోహన్ భాగవత్‌కు కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే ఒక లేఖ రాశారు. అందులో ఆయన సంస్థ చట్టపరమైన హోదాకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆ లేఖను వ్యక్తిగత హోదాలో కాకుండా, అధికారిక మంత్రి హోదాలో రాశానని స్పష్టం చేశారు. అందులో ఆయన ఆరఎసఎస్ రిజిస్ట్రేషన్, నిధులు, సంస్థాగత నిర్మాణం, రాజ్యాంగపరమైన జవాబుదారీతనం గురించి ఎనిమిది ప్రశ్నలను లేవనెత్తారు. 60,000కు పైగా శాఖల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న ఒక సంస్థ చట్టపరమైన నియంత్రణ పర్యవేక్షణ పరిధికి వెలుపల ఉండకూడదని ఆయన వాదించారు. హిందూ సమాజాన్ని, దాని చైతన్యాన్ని లక్ష్యంగా చేసుకోవడా నికి ఒక పాత వ్యూహాన్నే కొత్త రూపంలో ఈ లేఖ ద్వారా మరోసారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రయో గించింది. ఇది ఒక అంతర్గత వైరుధ్యాన్ని సూచి స్తుంది. కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ బహిరంగంగా, గర్వంగా తన హిందూ అస్తిత్వాన్ని ప్రకటించుకుంటారు. ఆయనతో కలిసి మంత్రిగా ఖర్గే పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా హిందూ అస్తిత్వాన్ని సమర్థిస్తుండగా, హిందూ చైతన్యాన్ని ప్రశ్నించే ముందు ఖర్గే తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే ప్రశ్న కూడా తలెత్తుతున్నది.
హిందూ చైతన్యం నుండి ఉద్భవించిన తాత్వికత
భారతదేశ పునరుజ్జీవనం, ధర్మ పరిరక్షణ కోసం 1925లో స్థాపించబడిన ఆరఎసఎస్, తన శతాబ్ద కాలపు ప్రయాణంలో ఏమి సాధించిందో, అది ఎందుకు అధికారిక నమోదుకు దూరంగా ఉందో అర్థం చేసుకోవలసిన అవసరం సామాన్య ప్రజలకు ఎంతైనా ఉంది. దీనికి ముందుగా ఆరఎసఎస్‌కు, హిందూ ధర్మానికి మధ్య ఉన్న సంబంధాన్ని గ్రహించాలి. హిందూ ధర్మం ఏ విధంగానైతే ఒకే ఒక్క రక్షకుడిపైన లేదా ప్రవక్తపైన ఆధారపడదో, ఒకే ఒక్క పవిత్ర గ్రంథానికి కట్టుబడి ఉండదో, ఒకే ఒక్క, అధికారిక ప్రార్థనా స్థలాన్ని నిర్దేశించదో, అలాగే ఆర్ఎస్ఎస్ కూడా ఒకే ఒక్క కార్యకలాపానికి లేదా వేదికకు పరిమితం కాదు.
అది హిందూధర్మపు శక్తిలాగే సమాజంలో వ్యాపించి ఉంది. ఈ భావనను “ధారయేత్ ఇతి ధర్మ” (ఏది నిలబెడుతుందో అదే ధర్మం) అనే ప్రాచీన తత్వశాస్త్రం ద్వారా ఉత్తమంగా అర్థం చేసుకోవచ్చు. భారతదేశ సాంస్కృతిక చైతన్యానికి ఏదైనా పునాది ఉన్నది అంటే అది ధర్మమే అవుతుంది. భారతీయ సంప్రదాయంలో, ధర్మం కేవలం ఒక మతం లేదా ఒక నిర్దిష్ట ఆరాధనా విధానం కాదు. అది వ్యక్తిని, సమాజాన్ని, విశ్వాన్ని నిలబెట్టే శాశ్వతమైన వ్యవస్థ. ‘ధ్రి’ (నిలబెట్టడం) అనే సంస్కృత మూల పదం నుండి ఉద్భవించిన ధర్మం, అస్తిత్వాన్ని కాపాడి, జీవితానికి అర్థాన్నిచ్చే దానికి ప్రతీకగా నిలుస్తుంది. హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి, దాని ఉనికిని కాపాడేందుకు అవసరమైన ‘హిందూ చైతన్యాన్ని’ పెంపొందించడానికి ఆరఎసఎస్ కట్టుబడి ఉంది. ఇది దేశ చిహ్నాలు, ప్రమాణాలు, ఆదర్శాలు, జీవన విధానాలకు ప్రతిరూపంగా నిలుస్తుంది. ఈ బాధ్యతను నిర్వర్తించడానికి, బ్రిటిష్ పాలన కాలంలో ఉన్న ‘సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం-1860’ నుండి ఎటువంటి ధ్రువీకరణ లేదా గుర్తింపు అవసరం పడలేదు. అలాగే, స్వాతంత్య్రం తర్వాత అమల్లోకి వచ్చిన 1950 నాటి రాజ్యాంగం కూడా హిందూ చైతన్య హితం కోసం పనిచేయడానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయలేదు. పైగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) వాక్ స్వాతంత్య్రం, భావప్రకటన స్వేచ్ఛ, సమావేశమయ్యే హక్కులకు హామీ ఇస్తుంది. శాంతియుతంగా కార్యకలాపాలు సాగించే వ్యక్తులు లేదా సమూహాలపై అధికారిక రిజిస్ట్రేషన్ కోసం ఇది ఎటువంటి చట్టపరమైన బాధ్యతను లేదా నిర్బంధాన్ని విధించదు.
హిందూ సమాజాన్ని మేల్కొల్పి, ఏకం చేయడమే ఆరఎసఎస్ ప్రధాన ధ్యేయం. ప్రభుత్వ గ్రాంట్లు, నిధులు లేదా పన్ను మినహాయింపులు ఆశించే ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జీఓ) తరహాలో ఇది పరిమితమైన, లావాదేవీల పరిధిలో పనిచేయదు. ఆరఎసఎస్ అనేది సమాజం నుంచి, సమాజం చేత, సమాజం కోసం ఏర్పడిన ఒక స్వచ్ఛంద, సైద్ధాంతిక సంస్థ. ఇది లాభాపేక్షతో నడిచే వాణిజ్య సంస్థ కాదు. అధికారాన్ని ఆశించే రాజకీయ పార్టీ కాదు. చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ ముసుగులో నిధుల సేకరణ వ్యాపారంలో నిమగ్నమైన ఎన్‌జీఓ కూడా కాదు. మానవాళికి నీటిని అందించ డంలో ఒక నదికి రిజిస్ట్రేషన్ అవసరమా? అని ప్రశ్నిస్తే అవసరం లేదు అనే సమాధానం. కానీ ఆ నీటిని సీసాలలో నింపి అమ్మే వాణిజ్య సంస్థకు మాత్రం కచ్చితంగా అవసరం. ఇది సమాజాన్ని, దాని సాంస్కృతిక విలువలను రాజ్యానికి లోబడి ఉండేవిగా పరిగణించే మనస్తత్వాన్ని ప్రతిబింబి స్తుంది. విద్యావంతుడైన మంత్రిగా ఖర్గేకు ఈ తేడా గురించి నిస్సందేహంగా తెలుసు.
సామూహిక చైతన్య నిర్మాణం
“రుతం చ సత్యం చాభిద్ధాత్త పసోధ్యాజాయత”
– రుగ్వేదం (10.85.1)
“నీతి, సత్యం శాశ్వతమైన విశ్వ క్రమం నుండి పుట్టాయి”
ధర్మానికి సారాంశంగా సత్యం, నీతి ఉన్నాయి. క్రమశిక్షణ, సదుద్దేశం, నిస్వార్థంతో కూడుకున్న వ్యక్తుల నెట్వర్క్‌ను పెంపొందించడం ద్వారా ఈ నైతిక, లౌకిక వ్యవస్థను క్షేత్రస్థాయిలో ఆవిష్కరించ డానికి ఆరఎసఎస్ అంకితమై ఉంది. చట్టాలు, అధికారిక నిబంధనలు వ్యవస్థలను, యంత్రాంగాన్ని నిర్మించగలిగినప్పటికీ, సకల జీవుల సంక్షేమాన్ని నిర్ధారించడానికి సమాజం నైతిక, ఆధ్యాత్మిక బలాన్ని కలిగి ఉండాలని మానవ చరిత్ర నిరూపిస్తుంది. ఇదే ఆర్ఎస్ఎస్ కచ్చితమైన కార్యాచరణ. దీనికి రాజ్యాంగ నిబంధన లేదా రిజిస్ట్రేషన్ అవసరమా? ఒకవేళ ఎవరైనా పెద్దల పట్ల గౌరవం, సామాజిక సామరస్యం, తమ సంస్కృతి, వారసత్వం పట్ల భక్తిని బోధించాలనుకుంటే, వారు ప్రభుత్వ అనుమతిని కోరాలా? ఖర్గేకు ఈ వాస్తవం తెలియదనేది అత్యంత అసంభవమైన విషయం.
ఏకత్వ భావన: పరమాణువు నుండి విశ్వం వరకు
ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల విధానం దాని సిద్ధాంతం, ఆచరణల మధ్య ఉన్న సంపూర్ణ సమన్వయాన్ని ప్రతిబింబిస్తుంది. దాని సమావేశాలు రుగ్వేదంలోని “సంగచ్ఛధ్వం సంవదధ్వం సం వో మనాంసి జానతామ।్ దేవా భాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే॥” (మండలం 10, సూక్తం 191, మంత్రం 2) అనే వైదిక ప్రార్థనతో ప్రారంభ మవుతాయి. “దేవతలు తమ హవిస్సులను ఏకమనోభావంతో సమర్పించినట్లే కలిసి నడవండి, కలిసి మాట్లాడండి, మీ మనస్సులు ఏకమై ఉండనివ్వండి” అనే అర్థాన్ని ఈ ప్రార్థన ఇస్తుంది. ఈ శ్లోకం ఐక్యత, సామరస్యం, సహకారానికి ఒక శక్తివంతమైన ప్రతీక. ఆధునిక సమాజానికి అత్యంత అవసరమైనవి అటువంటి శాశ్వత విలువలే కదా? అని ప్రశ్నిస్తే నిస్సందేహంగా అవును అనే సమాధానం వస్తుంది. ప్రభుత్వ నమోదు లేదా అధికారిక ప్రకటన లేకుండా ఐక్యత, సామరస్యం, పరోపకారం, సహకారం సాధ్యం కావని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోందా? ప్రతి ఆరఎసఎస్ కార్యక్రమం “సర్వేభవంతు సుఖినః, సర్వేసంతు నిరామయాః” (అందరూ సుఖంగా ఉండాలి, అందరూ అనారోగ్యం నుండి విముక్తులై ఉండాలి) అనే సర్వజన శ్రేయస్సును కోరే విశ్వవ్యాప్త ప్రార్థనతో ముగుస్తుంది. మానవాళి, ప్రకృతి శ్రేయస్సు కోసం చేసే సామూహిక కృషికి ప్రభుత్వ అనుమతి అవసరమా? ఒకవేళ అదే నిజమైతే, బ్రిటిష్ పాలన, కాంగ్రెస్ పార్టీ లేదా ఖర్గే ఉనికిలోకి రాకముందే, వేల సంవత్సరాలుగా హిందూ సమాజానికి దిశానిర్దేశం చేసే వెలుగుగా నిలిచిన ప్రాచీన వేద శ్లోకాలు నిలిచి ఉండేవి కావు.
మహాభారతం (శాంతి పర్వం, 109.10)లో చెప్పినట్టుగా “ధర్మో రక్షతి రక్షితః” (ధర్మాన్ని రక్షించేవారిని ధర్మం రక్షిస్తుంది) ధర్మ పరిరక్షణను ఆరఎసఎస్ ఎల్లప్పుడూ తన ప్రాథమిక కర్తవ్యంగా భావిస్తూ వచ్చింది. తత్ఫలితంగా, అది అంతర్గత, బాహ్య భారత్-వ్యతిరేక, హిందూ-వ్యతిరేక శక్తులకు లక్ష్యంగా మారింది. భారతదేశ పరిరక్షణ కోసం, హిందూ సంప్రదాయాలను నిరంతరం బలోపేతం చేయడం అనేది ఐచ్ఛికమైన పని కాదు. అది అత్యంత ఆవశ్యకమైన కార్యం.
ఆర్ఎస్ఎస్ అనేది ఒక జీవన విధానం, హిందూ చైతన్యానికి సంబంధించిన ఒక మేల్కొలుపు. దీనితో అనుబంధం కలిగి ఉండి చట్టబద్ధంగా నమోదైన సంస్థల ద్వారా లక్షలాది మంది పౌరులు దేశానికి వివిధ రంగాలలో సేవలు అందిస్తున్నారు. వీటిలో విద్య, ఆరోగ్య సంరక్షణ, సామాజిక సంక్షేమం, అనాథాశ్రమాలు, విశ్వవిద్యాలయాలు, ప్రచురణ సంస్థలు, మీడియా సంస్థలు, సాంస్కృతిక ట్రస్టులు, వ్యవసాయ, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఆర్థిక సంస్థలు వంటివి ఉన్నాయి. ఈ అనుబంధ సంస్థలన్నీ అధికారికంగా నమోదయ్యాయని, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయని, తమతమ రంగాలలో అగ్రగాములుగా గుర్తింపు పొందాయని ఖర్గేకు బాగా తెలుసు.
ఆర్ఎస్ఎస్‌కు సంబంధించిన ప్రతి విషయం బహిరంగమే. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. ప్రియాంక్ ఖర్గే తన తండ్రి(కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే)తో కలిసి ఏ ఆరఎసఎస్ కార్యక్రమానికైనా లేదా రోజువారీ ‘శాఖ’ కైనా హాజరై స్వయంగా పరిశీలించవచ్చు. ఆర్ఎస్ఎస్ ఎటువంటి ప్రభుత్వ గ్రాంట్లనూ స్వీకరించదు. దీని నిర్వహణ ఖర్చులు పూర్తిగా గురుపౌర్ణమి సందర్భంగా స్వయంసేవకులు సమర్పించే గురుదక్షిణ ద్వారానే సమకూరుతాయి. ఒకవేళ మంత్రికి ఈ వాస్తవాలు తెలిసి కూడా ఆయన వైఖరి ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకతను ప్రదర్శించేలా కనిపిస్తుంది. ఎన్నికైన ప్రజాప్రతినిధిగా ఆయన విచక్షణతో వ్యవహరించాలి.
ఆర్ఎస్ఎస్ అనేది వ్యక్తిత్వ వికాసానికి అంకిత మైన ఒక జీవితకాల క్రమశిక్షణ. దేశ వ్యతిరేక లేదా విభజనవాద ఉద్దేశాలు లేనంత వరకు, ఏ కులం, మతం, లింగం లేదా రాజకీయ భావజాలం కలిగిన వారికైనా ఇందులో ప్రవేశం ఉంటుంది. ఈ సంస్థ ద్వారా రూపుదిద్దుకున్న వ్యక్తులు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, బ్యాంకింగ్, విశ్వవిద్యాలయాలు, రైల్వేలు, తపాలా శాఖ వంటి వివిధ రంగాలలో సేవలు అందిస్తున్నారు. వారు తమ నిజాయతీ, వినయం, సామాజిక సామరస్యం పట్ల అంకితభావానికి గుర్తింపు పొందారు.
ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ కావాలని డిమాండ్ చేయడం అంటే, సాంస్కృతిక సమగ్రతా భావనతో ఏకీభవించే ప్రతి భారతీయుడు తమ వ్యక్తిగత విశ్వాసాలను ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేసుకోవాలా అని పరోక్షంగా అడగడమే అవుతుంది. ఆ మాటకొస్తే, ప్రతి హిందువు ఆలోచనా విధానాన్ని కూడా రిజిస్టర్ చేయాల్సి వస్తుంది.





