News

తిరుమల కొండపైకి కాలినడకన 116 ఏళ్ల వృద్ధురాలు..

5views

తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వచ్చిన 116 ఏళ్ల వృద్ధురాలు నవనీతమ్మకు టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబసభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించారు.

వందేళ్లు దాటిన వృద్ధురాలు శనివారం నాడు అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను కొంతమంది సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఆ వృద్ధురాలిది కర్ణాటక అని మొదట ప్రచారం జరిగింది. ఇది చూసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వృద్ధురాలి వివరాలు తెలిస్తే టీటీడీ ఆఫీసులో సంప్రదించాలని ఎక్స్‌లో పోస్టు కోరారు. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఆమె వివరాలను సేకరించారు. వృద్ధురాలిని తమిళనాడుకు చెందిన నవనీతమ్మగా గుర్తించి, టీటీడీ చైర్మన్‌కు సమాచారం అందించారు.

వృద్ధురాలి వివరాలను తెలుసుకున్న బీఆర్ నాయుడు ఆమెతో పాటు కుటుంబసభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం టీటీడీ అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు అందజేశారు. నవనీతమ్మకు నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.

దీనిపై బీఆర్ నాయుడు మరోసారి స్పందిస్తూ.. నవనీతమ్మను గుర్తించడంలో తమవంతు సహకారం అందించిన సోషల్‌మీడియా మిత్రులందరికీ, అలాగే టీటీడీ విజిలెన్స్ అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఒక భక్తురాలి జీవితకాల కోరిక నెరవేర్చిన ఈ సందర్భంగా తమ అందరికీ ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించిందని పేర్కొన్నారు.