
సంస్కార భారతి ఆధ్వర్యంలో పాండ్రంగిలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకల్లో ప్రదర్శించిన నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. స్వాతంత్ర్య సమరంలో అల్లూరి సీతారామరాజు ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, గిరిజనులను ఏకం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగించిన పోరాటం, దేశం కోసం చేసిన మహోన్నత త్యాగాలను హృద్యంగా ఆవిష్కరించారు.
నాటకంలోని ప్రతి ఘట్టం దేశభక్తి భావాలను రేకెత్తించేలా సాగగా, అల్లూరి నాయకత్వం, త్యాగనిరతి, స్వాతంత్ర్య సంకల్పాన్ని కళాకారులు భావోద్వేగభరితంగా ప్రేక్షకుల ముందుంచారు. ముఖ్యంగా రంపా ప్రాంత పోరాట ఘట్టాలు, గిరిజనులతో అల్లూరి అనుబంధాన్ని ప్రతిబింబించిన సన్నివేశాలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి.
మహనీయుల జీవిత చరిత్రలను కళారూపాల ద్వారా భావితరాలకు చేరవేయడంలో ఇటువంటి నాటకాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువతలో దేశభక్తి, జాతీయ చైతన్యం, సేవాభావాన్ని పెంపొందించేందుకు ఇవి దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.





