News

హిందూ దేవతలకు సంబంధించి యూట్యూబర్ ధృవ్ రాఠీ వీడియో తొలగించాలి : ఢిల్లీ హైకోర్టు

6views

హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ ధృవ్ రాఠీ వీడియో విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీడియోను తొలగించాలా లేదా అనే అంశంపై తదుపరి 15 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ  గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ  (Grievance Appellate Committee – GAC ) ను ఆదేశించింది.

న్యాయవాది అమితా సచ్‌దేవా దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన సందర్భంగా హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇదే వీడియోకు సంబంధించి ధృవ్ రాఠీపై ఆమె క్రిమినల్ ఫిర్యాదు కూడా దాఖలు చేశారు.

‘హిందూ దేవతల అవమానాన్ని సహించలేం’ 

విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ మాట్లాడుతూ, వీడియోలో హిందూ దేవతల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఇటువంటి కంటెంట్‌ను సహించలేమని, సంబంధిత మధ్యవర్తి (ప్లాట్‌ఫారమ్) స్వయంగా వీడియోను తొలగించాలనీ లేదా అందుకు కోర్టు తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

వివాదానికి కారణమైన వీడియో ఏది?

మార్చి 21న ధృవ్ రాఠీ తన యూట్యూబ్ ఛానల్‌లో “Can Hindus Eat Beef? Kerala Story 2 Revealed” అనే శీర్షికతో వీడియోను ప్రచురించారు. ఈ వీడియోలో హిందూ గ్రంథాల్లో పేర్కొన్న ఆహారపు అలవాట్ల గురించి చర్చిస్తూ, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి హిందూ దేవతలు మాంసాహారం తీసుకున్నట్లు కొన్ని ప్రాచీన గ్రంథాలు, ఋషుల ప్రస్తావనలను ఉదహరిస్తూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు హిందూ మత విశ్వాసాలను అవమానించేలా ఉన్నాయని ఆరోపిస్తూ న్యాయవాది అమితా సచ్‌దేవా అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉండగా, వీడియోపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వ గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ పరిశీలన అనంతరం వెలువడనుంది.